శేరిలింగంపల్లి, జూన్ 9: నగరంలో నేపాలీ గ్యాంగ్ వరుస దోపీడీ ఘటనలు కలకలం రేపుతున్నాయి. జుబ్లీహిల్స్, జవహర్‌నగర్ ఘటనలు మరువక ముందే గచ్చిబౌలిలో మరో దోపిడీ ఘటన సంచలనం సృష్టించింది. గచ్చిబౌలిలో ఓ వ్యాపారవేత్త ఇంటికి కన్నం వేసిన నేపాలీ గ్యాంగ్ ఏకంగా రూ.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలతో పరారయ్యారు. ఈ ముఠాను ఉత్తర్ఖండ్ సరిహద్దులో గచ్చిబౌలీ పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో పట్టుకున్నారు.
నెల రోజుల క్రితమే వ్యాపారి ఇంట్లో పని కోసం చేరిన నేపాలీ జంట మరో వ్యక్తితో కలిసి ఈ చోరీకి పాల్పడ్డారు. కాగా వ్యాపారవేత్త తన కుటుంబంతో ఢిల్లీకి వెళ్తూ లాకర్ తాళం వేసి తాళం చెవిని లాకర్ మీద ఉన్న చెంబులో పెట్టడమే నిందితులకు వరంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి హిల్ రిడ్జ్ కమ్యూనిటీలోని విల్లా నంబర్ 73లో ప్రకాష్ పాయ్(73) తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు.
కాగా ప్రకాష్ పాయ్ ఢిల్లీలో ఉన్న తన బంధువుల ఇంట్లో వేడుక కోసం తన భార్య వందన, కుమారుడు అభిజిత్‌తో కలిసి ఈ నెల 6న బయల్దేరి వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఢిల్లీకి వెళ్లిన ప్రకాష్ పాయ్ 7 న సాయంత్రం తిరిగి రాగా, ఇంటి బాల్కనీకి చెందిన గ్లాస్ పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా, లాకర్ పైన వినాయకుడి చిత్ర పటానికి ఉన్న 4 తులాల బంగారు గొలుసు కనిపించలేదు.
దీంతో పాటు ఇంట్లోని సర్వెంట్ గదిలో ఉండాల్సిన నేపాలీ భార్య, భర్త సైతం కనిపించకుండా పోయారు. దీంతో ప్రకాష్ పాయ్ వెంటనే గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఓ వైపు నేపాలీ జంట కోసం గాలింపు చేపడుతుండగా, ప్రకాష్ పాయ్ ఆ మర్నాడు ఇంట్లో ఉన్న లాకర్‌ను తెరిచి చూడగా, అందులో ఉండాల్సిన దాదాపు 5 కిలోల బంగారు ఆభరణాలు, వజ్రాల ఆభరణాలు కనిపించలేదు. దీంతో ప్రకాష్ పాయ్ మరోసారి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు.
కాగా వ్యాపారవేత్త ప్రకాష్ పాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు 6 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. హిల్ రిడ్జ్ విల్లా నుంచి సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు 6 ప్రత్యేక బృందాలతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లో గాలింపు చేపట్టారు. నిందితులు దేశం దాటి నేపాల్‌కు వెళ్లకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు సరిహద్దు రాష్ర్టాలపై దృష్టి పెట్టారు. కాగా ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌కు వెళ్లిన రెండు ప్రత్యేక బృందాలు, నిందితులను స్థానిక పోలీసులతో కలిసి పట్టుకున్నారు. నిందితులు అపహరించిన సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
చోరీ అనంతరం నేపాలీ గ్యాంగ్ హిల్ రిడ్జ్ విల్లా నుంచి తాపీగా నడుచుకుంటూ పక్కనే ఉన్న ట్రిపుల్ ఐటీ జంక్షన్‌కు నడుచుకుంటూ వచ్చారు. అనంతరం అక్కడి నుంచి ఓ ఆటోలో సికింద్రాబాద్‌కు వెళ్లారు. అక్కడ ట్రెయిన్ ఎక్కి నగరం నుంచి పరారైనట్లు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు.