మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో ఇండ్లు కోల్పోవడం మధు పార్క్అపార్ట్మెంట్ నివాసితుల ఒక్కరి సమస్య కాదని, ఇది మూసీ బాధితులందరి సమస్య అని పలువురు వక్తలు అన్నారు. ఆదివారం మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పెద్ద ఎత్తున అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. తమ హక్కులు, ఇండ్లు కాపాడాలంటూ.. రాహుల్ గాంధీకి చిన్నారులు పోస్టు కార్డులు రాశారు. కాగా, అపార్ట్మెంట్ వాసుల నిరసనకు మూసీ జన ఆందోళన్, తెలంగాణ బస్తీ జేఏసీ మద్దతు తెలిపాయి. బాధితుల తరఫున ఐక్య పోరాటాలు చేస్తామని ఆయా ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు కే శ్రీనివాస్ మాట్లాడుతూ.. భూమికి భూమి ఇల్లుకు ఇల్లు ఒక మధు పార్క్ అపార్ట్‌మెంట్‌కు ఇస్తే.. మూసీ పరీవాహక బాధితులందరికీ ఇవ్వాల్సిందే.. అది ముమ్మాటికీ సాధ్యం కాదన్నారు. ప్రజలెవరూ ప్రభుత్వం కానీ ప్రజా ప్రతినిధులు చెప్పేమాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టే పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఎంఆర్డీసీఎల్ చైర్మన్ టీడీఆర్‌లు ఇస్తామని ప్రకటించినట్లు గుర్తు చేశారు. రెండున్నరేండ్లలో మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు చేపట్టడం సాధ్యం కాదని, మన ఇండ్లను కాపాడుకోవడమే ప్రభుత్వం నుంచి మనం పొందే అసలైన పరిహారం అని అపార్ట్మెంట్ వాసులకు సూచించారు. ఈ మేరకు బాధితులందరూ కలిసికట్టుగా పోరాడితేనే ప్రభుత్వం దిగివస్తుందని వెల్లడించారు. బాధితులను విడదీసి ఇండ్లు, భూములను కొల్లగొట్టేందుకే మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును రెండు మూడు ఫేజ్‌లుగా మారుస్తున్నారని ఆరోపించారు.
– సిటీబ్యూరో

పాలకూరలో విషం..
మూసీ మురుగు ప్రభావిత ప్రాం తాలు విషతుల్యం అవుతున్నాయి. మూసీ కాలుష్యం ప్రభావంతో అక్కడ పాలకూరలో విషం ఉంటుంది. మూసీలోకి కూకట్పల్లి నాలా, పటాన్చెరు, జీడిమెట్ల సహా 16 పారిశ్రామిక వాడల కాలుష్య కారకాలు నిత్యం మూసీ నదిలో కలుస్తున్నాయి. వాటిని కలవడకుండా ఆపడం మానేసి మూసీని సుందరీకరిస్తామని అనడం హాస్యాస్పదంగా ఉన్నది. మూసీలో పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు చేరిపోయి అత్యంత్ర ప్రమాకరమైన సైనైడ్ ఉన్నదని సర్వేల్లో తేలింది. దాన్ని నియంత్రించలేని ప్రభుత్వం మూసీని సుందరీకరించి నీటిని శుద్ధి చేస్తామనడం పరీవాహక ప్రజలను మోసం చేయడంలో భాగమే. మూసీ మురుగుతో సుమారు 8 లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారు. మూసీని శుభ్రం చేస్తామంటే మాకేం అభ్యంతరం లేదు. సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను లాక్కుంటామంటేనే సహించం. ఐక్యంగా పోరాటాలు చేస్తాం. ప్రభుత్వం దిగొచ్చేదాకా కొట్లాడతాం.
– జీవన్‌కుమార్, మానవ హక్కుల వేదిక
బాధితులను విడదీసేందుకే..
మూసీ పరీవాహక ప్రజలు విడదీసి ఇండ్లను కూల్చేందుకే ఒక్కటిగా ఉన్న మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ఫేజ్‌ల వారీగా ముక్కలు చేస్తున్నారు. ఒక్కో ఫేజ్ ఒక్కో ప్రాంతానికి పరిమితం చేసి.. అక్కడి ప్రజల ఇండ్లు, భూములను కొల్లగొట్టేందుకు కుట్ర చేస్తున్నారు. మూడు వేల ఎకరాల భూములను స్వాధీనం చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. ఇది మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసుల ఒక్కరి సమస్య కాదు.. మొత్తం హైదరాబాద్‌లోని మూసీ పరీవాహక ప్రజలందరి సమస్య. దీన్ని గ్రహించి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను చేధించాలి. సీఎం కావాలనే మహిళా దినోత్సవ కార్యక్రమంలో మూసీ ప్రస్తావన తీసుకొచ్చారు. మధు పార్క్‌లో జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి.. ఇల్లుకు ఇల్లు, భూమికి భూమి ఇస్తామని చెబుతున్నారు. మరి ఇండ్లు కూల్చే ప్రతి ప్రాంతంలో ప్రముఖులు ఉండాలా? ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే సీఎం ప్రతి అధికారిక కార్యక్రమంలో మూసీ ప్రస్తావన తీసుకొచ్చి డైవర్ట్ చేస్తున్నారు. దాన్ని గ్రహించి అందరూ అప్రమత్తంగా ఉండి ప్రభుత్వం ట్రాప్‌లో పడకుండా జాగ్రత్త పడాలి.
-సజయ, జర్నలిస్టు

మూసీ మురుగుతో దందా
సీఎం రేవంత్‌రెడ్డి మూసీ మురుగు కంపుతో రియల్ ఎస్టేట్ దందా చేయాలని చూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యం లేకుండా నియంతృత్వ పాలన సాగిస్తున్నది. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు జీవించే హక్కును కాలరాస్తున్నారు. రేవంత్‌రెడ్డి మూసీ ప్రాజెక్టుకు రోల్ మోడల్‌గా చెప్తున్న థేమ్స్, సియోల్, సబర్మతి ఫెయిల్యూర్ ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చెబుతున్న రూ.లక్షన్నర కోట్లు ఎవరి జేబుల్లోకి నింపుకొంటారు? ఇది మధు పార్క్ నివాసితుల పోరాటం కాదు.. మొత్తం మూసీ బాధితుల పోరాటం. ఈ పోరాటానికి మేధావులందరినీ ఏకం చేసి పూర్తిగా మద్దతు తెలుపుతాం. ప్రభుత్వమే అన్ని అనుమతులిచ్చి.. రూ.లక్షల్లో ట్యాక్సులు కట్టించుకుని ఇప్పుడు ఖాళీ చేసి వెళ్లిపోవాలనడం సీఎం రేవంత్‌రెడ్డి నియంతృత్వ పాలనకు పరాకాష్ఠ. ప్రజలను డైవర్ట్ చేసి బలవంతంగా ఇండ్లు ఖాళీ చేయించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. వాటిని పసిగట్టి అప్రమత్తంగా ఉండాలి.
-విఠల్, తెలంగాణ ఉద్యమకారుడు
మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
మూసీ సుందరీకరణ పేరిట కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ పరీవాహక ప్రజలను మోసం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే మూసీ ప్రాజెక్టుకు రుణం మంజూరు చేయడంపై కసరత్తు చేస్తున్నామని స్వయంగా ఏడీబీ బ్యాంకు స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 25 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం నిధులతో పాటు బ్యాంకు రుణం 50 శాతం తీసుకునేందుకు నిర్ణయించారు. కేంద్రంలోని బీజేపీ కూడా మూసీ పేదలను రోడ్డున పడేసే కుట్రలో భాగమైంది. అందులో భాగంగానే కేంద్ర మంత్రి గడ్కరీని సుందరీకరణ పనులు ప్రారంభించేందుకు ముఖ్యఅతిథిగా పిలుస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి మూసీ పరీవాహక పేద, మధ్య తరగతి ప్రజలను రోడ్డున పడేసేందుకు కంకణం కట్టుకున్నాయి. అందుకే ఇద్దరు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, 8 మంది ఎమ్మెల్యేలు బాధితుల పక్షాన నోరు మెదపకుండా ఉంటున్నారు. అసలు మూసీ ప్రాజెక్టుపై బీజేపీ వైఖరి ఏంటో బాధిత ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరమున్నది.
– గోసుల శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ బస్తీ జేఏసీ చైర్మన్
ఐక్య పోరాటాలతోనే న్యాయం
మూసీ పరీవాహక ప్రజలను విడదీసి ఇక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. బాధిత ప్రజలందరూ పేద, ధనిక తేడా లేకుండా ఐకమత్యంతో పోరాటం చేస్తేనే ప్రభుత్వం దిగి వస్తుంది. బాధిత ప్రజలకు నాయ్యం జరగాలంటే కలిసికట్టుగా ముందుకు సాగాలి. మూసీ ఒడ్డున ఉన్న సుమారు లక్షా ముప్పై వేల మంది ప్రజలను రోడ్డున పడేసేందుకు ప్రభుత్వం ఒక అజెండాతో పనిచేస్తున్నది. ప్రభుత్వం కుట్రలను తిప్పికొట్టేందుకు అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలవాలి. పేద ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించవద్దు. వాళ్లు లేకుంటే ఏ మధ్యతరగతి, ధనిక కుటుంబాలకు ఒక్క రోజు కూడా గడవదని గుర్తుంచుకోవాలి. అందుకే మధు పార్క్‌లోని మధ్య తరగతి ప్రజలు.. మూసీ ఒడ్డున ఉన్న బస్తీ వాసులు ఐక్యంగా పోరాటాలు చేయాలి.
– వర్గీస్, మూసీ జన ఆందోళన్
