దుండిగల్, ఫిబ్రవరి 4: చర్చిగాగిళ్లాపూర్లో రెండురోజుల కిందట దారుణహత్యకు గురైన చిన్నబత్తిని సుశీలమ్మ(85) కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ఆమె ఒంటిపై ఉన్న చెవికమ్మలు, ఉంగరం కోసమే హత్యజరిగినట్లు తేల్చారు. కుత్బుల్లాపూర్ జోన్ ఏసీపీ సీహెచ్ శంకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జోగిపేటకు చెందిన కవిత(36) అనే మహిళ గాగిళ్లాపూర్లో నివాసముంటూ భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నది. నెలరోజుల కిందట కవిత చర్చిగాగిళ్లాపూర్లోని సుశీలమ్మకు చెందిన ఇంటి మరమ్మతు పనుల్లో కూలీగా పనిచేసింది. వృద్ధురాలి చెవి కమ్మలు, చేతివేలి ఉంగరంపై కన్ను వేసింది.
సుశీలమ్మలకు కల్లు తాగే అలవాటు ఉండటంతో కవిత కూలీ పనికి వచ్చేరోజుల్లో ఆమెతో కలిసి కల్లు సేవించేది. ఈనెల 2న కవిత సుశీలమ్మకు కల్లు తాగించింది. సుశీలమ్మ మత్తులోకి జారుకోగానే మృతురాలి తలను గోడకు బలంగా కొట్టడంతో సృహ కోల్పోయింది. ఆమె చెవులకు ఉన్న ఒక జత కమ్మలు(రింగులు),చే తికున్న ఉంగరాన్ని దొంగిలిస్తుండగా, కదలడంతో బండరాయితో తలపై కొట్టి చంపింది. పోలీసులు కవితను అదుపులోకి తీసుకొని.. కోర్టులో ప్రవేశపెట్టారు.