మల్కాజిగిరి, డిసెంబర్ 16 : కుటుంబకలహాలతో తన ఏడేండ్ల కుమార్తెను తల్లి భవనం నుంచి తోసేసింది. దీంతో ఆ బాలిక చనిపోయింది. ఈ దారుణ ఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. మల్కాజిగిరి సీఐ కథనం ప్రకారం.. మల్కాజిగిరి వసంతపురికాలనీ రోడ్డు నం. 13లో డేవిడ్ తన భార్య మోనాలిస, కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నారు. ఇటీవల కుటుంబంలో ఘర్షణలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం మోనాలిస తన ఏడేండ్ల కుమార్తె షరోన్ మేరీని తాము ఉంటున్న మూడో అంతస్తు భవనం నుంచి కిందికి పడేసింది. అప్రమత్తమైన కుటుంబసభ్యులు బాలికను ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాలిక మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని, విచారణ చేపట్టారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమర్టం తరలించి, కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతురాలి తండ్రి డేవిడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.