నేరేడ్మెట్, డిసెంబర్ 27 : పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్‌ను నియంత్రించాలని నిరంతరం ప్రభుత్వం కృషి చేస్తున్నా.. కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోజురోజుకు ప్లాస్టిక్ వాడకం పెరిగిపోతున్నది. ప్లాస్టిక్ వవర్లు వాడవద్దని అధికారులు వ్యాపార వర్గాల్లో నిత్యం అవగాహన కల్పిస్తున్నా.. వారిలో ఎటువంటి మార్పు రావడంలేదు. దీంతో రోజురోజుకు ప్లాస్టిక్ వాడ కం పెరిగిపోతున్నది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం ఫుట్‌పాత్‌లపై నిర్వహించే హోటల్స్, చిరువ్యాపారులు, కిరాణా దుకాణాలవారు తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లను వాడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్లాస్టిక్ కవర్లను వాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
రోడ్లపై కుప్పలుగా..
దేవినగర్, నేరేడ్మెట్, యాప్రాల్, బాలాజీకాలనీలలోని ప్రధాన రోడ్లపై ప్రజలు చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను పారేస్తుండటంతో మినీ డంపింగ్ యార్డులా మారుతున్నది. వాటిని మూగజీవాలు చిందరవందర చేస్తూ రోడ్లపైకి ఈడ్చుకువస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ చెత్తా చెదారంతో నిండిపోతున్నాయి. పలుమార్లు సం బంధిత అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు సమస్యను వివరించినా ఫలితం లేకుండా పోతోంది. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు పారవేయడంతో దుర్గంధం, దుర్వాసన వెదజల్లుతోంది. అంతేగా కుండా పర్యావరణానికి ఇబ్బంది కలుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిఘా పెట్టి..ప్లాస్టిక్ కవర్లు వాడకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం..
ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా స్పందన శూన్యం. వారాంతపు సంతలలో, వీధుల్లో వ్యాపారస్తులపై దృష్టి పెట్టాం. ఎవరైనా ప్టాస్టిక్ కవర్లు వాడితే తప్పకుండా కఠిన చర్య లు తీసుకుంటాం. ఇప్పటికే కొన్ని షాపుల్లో పేపర్ బ్యాగులు వాడుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు, వ్యాపారస్తుల్లో మార్పు వస్తే బాగుం టుంది. ఎవరైనా తక్కవమందం కలిగిన ప్టాస్టిక్‌ను వాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– రాజు, డీసీ