కొండాపూర్, జూన్ 15 : నల్లగండ్ల లక్ష్మీ విహార్ ఫేజ్ -1లో మహిళ గొంతు కోసి హత్యకు పాల్పడిన నిందితుడిని చందానగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ పాలవెల్లి శనివారం వివరాలు వెల్లడించారు. లింగంపల్లి కానుకుంటలో నివాసం ఉండే యాపచెట్టుకాడి భరత్‌గౌడ్, అలియాస్ శ్రీనుకు నల్లగండ్లలో నివాసం ఉండే విజయలక్ష్మి (35)తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి కారణమైంది. కాగా విజయలక్ష్మి తన సోదరుడి కోసం భరత్‌గౌడ్ వద్ద డబ్బులు తీసుకుంది. కొద్దిరోజుల తర్వాత భరత్‌ను దూరం పెట్టి వేరే వాళ్లతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. భరత్ పలుమార్లు హెచ్చరించిన పద్ధతి మార్చుకోలేదు. భరత్ భార్య సైతం వివాహేతర సంబంధంపై కేసు పెట్టింది. దీంతో కక్ష పెంచుకున్న భరత్‌గౌడ్ ఎలాగైన విజయలక్ష్మిని చంపేయాలని నిశ్చయించుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం నల్లగండ్లలోని ఆమె నివాసానికి విజయలక్ష్మి చిన్నకొడుకు ముందే ఆమెను కిరాతకంగా గొంతుకోసి హతమార్చాడు. అనంతరం చందానగర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకుని భరత్గౌడ్ను రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ పాలవెల్లి తెలిపారు.