సిటీబ్యూరో, మార్చి31 (నమస్తే తెలంగాణ):రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు , జర్నలిస్టులకోసం నగదు రహిత ఉచిత వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లు అక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయి. పలువురు ఉద్యోగులు వైద్యాన్ని వ్యాపారం చేస్తూ విచ్చలవిడిగా డబ్బులు దండుకుంటున్నారు. వైద్యం కోసం వచ్చినవారికి ఉచిత మందులు అందించేందుకు కోట్లు వెచ్చించి ఫార్మా కంపెనీల వద్ద కొనుగోలు చేస్తున్న మందులు పక్కదారి పడుతున్నాయి. అంతేగాకుండా ఆధారాలు లేకుండా ఉద్యోగం ముసుగులో మటుమాయం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఉద్యోగానికి సెలవు పెట్టిన వారి వేతనాలు సైతం ప్రతినెలా తన ఖాతాలోకి మలుపుకుంటున్న పొరుగుసేవల ఏజెన్సీ నిర్వాకం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
ఉద్యోగం ముసుగులో మటుమాయం..
రాష్ట్ర వ్యాప్తంగా 12 వెల్నెస్ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో సుమారు 253 మంది సిబ్బంది పొరుగుసేవల ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వైద్యులు, ల్యాబ్ టెక్నిషియన్లు, ఫార్మసిస్టులు, నర్సులు మొదలైన సిబ్బందంతా ఔట్సోర్సింగ్ విధానంలో వైద్య సేవలందిస్తున్న వారే కావడం గమనార్హం. ఇన్ని విభాగాల్లో వైద్య సేవలందించేందుకు ఒక్క రెగ్యులర్ వైద్యుడు లేడు. వీటికి తోడు పలు సెంటర్లలో ఓపీలు తక్కువ ఉన్నారన్న సాకుతో హాజరు వేసుకొని ఇంటికి వెళ్లిపోయే వారు కూడా ఉన్నారు. పలువురు పొరుగుసేవల సిబ్బంది గతంలో వివిధ సంస్థల్లో విలేకరులుగా చేసినవారు ఉన్నారు.
వారంతా జర్నలిస్టులుగా ఆయా కేంద్రల్లో వైద్యం చేయించుకునేందుకు అర్హులే. అయితే జర్నలిస్టు కార్డులు చూపి కావాల్సిన మందులు ఉచితంగా తీసుకొని బయట ప్రైవేట్ వ్యక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నయి. సిబ్బంది సహకారంతో ఫార్మసీ ప్రతినిధితులతో తమకు కావాల్సిన మందులు ఇండెంట్ పెట్టి తెప్పించుకోవడం, వాటిని బయట విక్రయించడం పనిగా పెట్టుకున్నారు. ఈ తరహా దారుణాలు జరుగుతున్నా అధికారులు తనిఖీలు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కావాలనే అలాంటి సిబ్బందిని వెనకేసుకొస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. 2023-24 ఏడాదిలోనే వెల్నెస్ సెంటర్లకు మందులు కొనేందుకు రూ.19.19 కోట్లు ఖర్చు అయినట్లు లెక్కలు చూపించడం గమనర్హం.
విధులకు రాకున్నా వేతనాలా?
రాష్ట్ర వ్యాప్తంగా వెల్నెస్ సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బంది అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాల వల్ల విధులకు రాకుండా నెలల తరబడి సెలవులో ఉన్నవారి వేతనాలు వారి ఖాతాల్లోకి జమచేస్తూ.. తిరిగి పొరుగుసేవల ఏజెన్సీ ఆ సొమ్మును తన ఖాతాలోకి మల్లించుకొంటున్నారు. దీంతో ప్రభుత్వ సొమ్ముకు గండి పడుతోంది. ఈ తరహా మోసాలపై చర్యలు తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇదిలా ఉండగా రోగులపై సిబ్బంది నిర్లక్ష్యం చెప్పాల్సిన అవసరమే లేదు.
అవినీతిమయం
వెల్నెస్ సెంటర్లలో ఉద్యోగుల నియామకాలు, మందుల కొనుగోళ్ల తీరు మొత్తం అయోమయంగా కొనసాగుతుంది. గ్రేటర్ పరిధిలో ఉన్న సెంటర్లలో అధికారుల పర్యవేక్షణ కరవైంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ చేపట్టాలి. అవినీతి జరుతున్నట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.
– వెంకటేశ్, సీపీఎం గ్రేటర్ సెంట్రల్ సిటీ కార్యదర్శి