అడ్డగుట్ట, మే 5 : పనులు ప్రారంభించారు..మధ్యలోనే ఆపేశారు..దీంతో ప్రజలకు, వాహనదారులకు శాపంగా మారింది. ఇంత జరిగినా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నిధులుండి కూడా పనుల్లో జాప్యం ఎందుకు చేస్తున్నారో అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలోకెళ్తే.. అడ్డగుట్ట డివిజన్లోని ఉపేందర్ స్థూపం వద్ద సీసీ రోడ్డు నిర్మించడానికి రూ.7 లక్షల నిధులు మంజూరయ్యాయి. దీంతో అధికారులు రోడ్డును తవ్వారు.ఇప్పటివరకు బాగానే ఉన్న సదరు రోడ్డను తవ్వి నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు పనులను ప్రారంభించే దిశగా అధికారులు అడుగులు వేయడం లేదు. నిత్యం ఆ దారిగుండా రాకపోకలను సాగించే వాహనదారులు, స్థానిక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
నిధులున్నా… రోడ్డును తవ్వి మధ్యలోనే ఎందుకు వదిలేశారో అర్థం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇదిలా ఉండగా డ్రైనేజీ, మంచినీటి పైపులైన్ పనుల నిమిత్తం తవ్విన రోడ్లకు మరమ్మతులు చేస్తే సరిపోయే వాటికి కూడా కొత్త రోడ్లను వేసేందుకు ప్రతిపాదనలను చేస్తూ అధికారులు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత విభాగం ఉన్నతాధికారులు చొరవ తీసుకొని సీసీ రోడ్డు పనులు చేపడితే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.