ఉస్మానియా యూనివర్సిటీ : సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను న్యాయవ్యవస్థ ద్వారా పరిష్కరించేందుకు న్యాయ కళాశాలలు తోడ్పడాలని ఓయూ లా విభాగం డీన్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ సూచించారు. దీనికి న్యాయవిద్యార్థులు, న్యాయమూర్తులు కలిసి రాజ్యాంగ లక్ష్యాల సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఓయూ లా డీన్‌గా ప్రొఫెసర్ వినోద్‌కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సెమినార్ హాళ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను లా విభాగం పరిశోధక విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో, ప్రజలు కోరుకుంటున్న స్థాయిలో న్యాయ కళాశాలలు పనిచేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రజా సమస్యల పరిష్కారంలో న్యాయ కళాశాలల పాత్ర ఆశించిన స్థాయిలో లేదని అభిప్రాయపడ్డారు. మరిన్ని పరిశోధనలు చేసి, ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చుటకు ప్రతి న్యాయ విద్యార్థి అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేయాలన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేస్తున్న ప్రొఫెసర్ వినోద్‌కుమార్ చిన్న వయసులోనే డీన్ స్థాయికి ఎదిగిన మొదటి దళిత ప్రొఫెసర్‌గా చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. అమెరికాలోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొని పరిశోధనా పత్రం సమర్పించారని గుర్తు చేశారు. ఆయన ఆధ్వర్యంలో న్యాయ కళాశాల మరింత పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.