ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 8 : తెలంగాణ రాష్ట్ర రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనాల్సిందేనని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతుల గొంతుకను కేంద్రానికి వినిపించేందుకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ నెల 11న ఢిల్లీలో చేపట్టనున్న దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులు, యావత్ ప్రజలు ఎలా పోరాడారో అదే విధంగా కేసీఆర్ నాయకత్వంలో మరోసారి రైతులకు మద్దతుగా పోరాటం చేయాలని అన్నారు. ఈ ధర్నాకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రైతన్నలకు తమ మద్దతు తెలుపాలని కోరారు. కేంద్రప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే బీజేపీ నాయకులను రాష్ట్రంలో తిరుగనీయబోమని, వారిని అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు.