సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ): అన్ని ఉన్నా… అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఉంది కొత్వాల్‌గూడ ఎకో పార్క్ పరిస్థితి. వరల్డ్ క్లాస్ టూరిజం సేవలు అందించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు కాంగ్రెస్ రాకతో గ్రహణం పట్టినైట్లెంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పెండింగ్ పనులను పూర్తిచేసేందుకు చొరవ చూపడంలేదనే విమర్శలున్నాయి. ఎలాగోలా పనులు చేపట్టి ప్రాజెక్టు నిర్మాణాన్ని కొలిక్కి తీసుకువస్తే… సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ దొరక్కపోవడంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు.
100 ఎకరాల విస్తీర్ణంలో..
గండిపేట సమీపంలో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఎకో పార్క్‌ను మూడేళ్ల కిం దట హెచ్ఎండీఏ చేపట్టింది. పార్క్‌తోపాటు వరల్డ్ క్లాస్ టూరిజం అనుభూతిని కలిగించేలా అక్వేరియం, పక్షిశాలతోపాటు, జంట జలాశయాలను చూసేందుకు వీలుగా లోకేషన్ స్పా ట్లను కూడా డెవలప్ చేసింది. కానీ ప్రభుత్వ పెద్దల ఆలసత్వంతో పనులు నత్తనడనక సాగినా… ఎట్టకేలకు తుది దశలో ఉన్నాయి. అయితే ప్రారంభోత్సవం ఎప్పుడనేది అధికారులకే అంతు చిక్కని ప్రశ్నగా మారింది.
ఆధునాతన టూరిజం వసతులను కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే… విదేశీ టూరిస్టుల రాక మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఓపెన్ ఎయిర్ థియేటర్, ఎంట్రెన్స్ ఆర్చ్, ఓపెన్ ప్లాజా, అప్రోచ్ రోడ్డు, ల్యాండ్ స్కేపింగ్, గ్రీనరీ సౌకర్యాలతోపాటు 8వేలకు పైగా విదేశీ పక్షులతో అద్భుతమైన పక్షి కేంద్రాన్ని కలిగి ఉంది. సందర్శకులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు, బల్లలను బిగించారు.
వీకెండ్ స్పాట్‌గా మారే అవకాశం..
కోటిన్నర అంచనా వ్యయంతో పార్కు పరిధిలో పనులకు హెచ్ఎండీఏ ఏర్పాట్లు చేసింది. మహానగర జంట జలాశయాలకు సమీపంలో ఉండటంతో ఇదొక వీకెండ్ ఫ్యామిలీ ఎకో టూరిజం స్పాట్‌గా మారనుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి సమయం కోసం అధికారులు ఎదురుచూస్తూ… గడిచిన 6 నెలలుగా ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా ఎకో పార్కును ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.