Child Sale | సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): పసిపిల్లలను అక్రమ విక్రయాలకు దవాఖానాలలో పనిచేసే వారి వద్ద నుంచే నాంది పలుకుతుంది. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని పిల్లలను విక్రయించే వాళ్లను ఎంపిక చేస్తున్నారు. రాష్ర్టాలు, ప్రధాన పట్టణాలలో పిల్లల విక్రయానికి సంబంధించిన ముఠాలకు సోషల్‌మీడియానే వేదికవుతుంది. అమ్మేవారికి, కొనే ముఠాలను సోషల్మీడియాలలోనే ఎక్కువగా పరిచయాలు అవుతున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఏడాది కాలంలో రాచకొండ పోలీసులు అంతరాష్ట్ర పిల్లల విక్రయాలకు సంబంధించిన ఆరు ముఠాల లింక్‌లను ఛేదించారు. గత ఏడాది మేడిపల్లిలో ఢిల్లీకి సంబంధించిన నెట్‌వర్క్‌ను ఛేదించగా తాజాగా మల్కాజిగిరి ఎస్ఓటీ, చైతన్యపురి పోలీసులు సుమారు పది రాష్ర్టాలతో ముడిపడి ఉన్న ఐదు నెట్వర్కులకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. పిల్లలు కావాల్సిన వాళ్లు, పిల్లలను విక్రయించే వాళ్లను గుర్తించడంలో దవాఖానాలలో పనిచేసే వారైతేనే ఈజీగా ఉంటుందని ఆయా ముఠాలు భావిస్తూ మెడికల్ ఫీల్డ్‌తో టచ్‌లో ఉన్న వారిని తమ గ్యాంగ్‌లో కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు.
సోషల్‌మీడియా కలిపేస్తోంది!
సాధారణంగా ఒక ప్రాంతంలో పనిచేసే వారు ఆ ప్రాంతంలోనే తమ పనులు సాగిస్తుంటారు. సోషల్‌మీడియాలోకి వెళ్లే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెట్వర్కులతో పరిచయాలు ఏర్పడుతాయి. రాచకొండ పోలీసులకు పట్టుబడ్డ గ్యాంగ్‌లలో హైదరాబాద్, ఏపీ, గుజరాత్, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, యూపీ, కర్ణాటక, కేరళ, ఢిల్లీకి సంబంధించిన లింక్‌లు బయటపడ్డాయి. హైదరాబాద్‌లో ఆశ వర్కర్‌గా పనిచేసే అమూల్య, మలక్‌పేట్ ఏరియా దవాఖానాలో పనిచేసే ఇస్మాయిల్‌తో స్థానికంగా పిల్లలను విక్రయించారు. ఆ తరువాత గుజరాత్‌కు చెందిన వందన , దీప్తి నెట్‌వర్క్‌తో అమూల్యకు పరిచయం కావడంతో కొన్ని రోజులు వారితో కలిసి పిల్లల విక్రయాలను సాగించింది. ఆ తరువాత తానే స్వయంగా సోషల్‌మీడియాలో తన నెట్వర్కును పెంచుకుంది. అలాగే దీప్తి సైతం తన సొంతంగా నెట్వర్కును తయారు చేసుకుంది. ఇలా ఒకో పసిపిల్లల విక్రయం వద్ద రూ. 3 నుంచి 4 లక్షల లాభాలు వస్తుండడంతో దీనిని ఈ ముఠాలు వ్యాపారంగా కొనసాగిస్తున్నాయి.
అమ్మకానికే!
యూపీ, గుజరాత్, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ తదితర రాష్ర్టాలలో పిల్లలను విక్రయించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఒక రాష్ట్రంలో పుట్టిన పిల్లలను మరో రాష్ట్రంలో విక్రయించడం వల్ల ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండవని ఈ ముఠాలు భావిస్తున్నాయి. దీంతో పేదరికంతో ఉన్న వారిని ఎంచుకొని వారు ఎప్పుడు కాన్పు అవుతున్నారు, వారికి పుట్టబోయే బిడ్డను ఒకటి రెండు రోజుల్లోనే తమకు అప్పగించాలని మందుగానే అడ్వాన్స్‌లు కూడా ఇస్తున్నట్లు తెలిసింది. ఇందులో కొందరు పిల్లలను పెంచడానికి స్థోమత లేక, మరికొందరు డబ్బు కోసం పుట్టిన బిడ్డలను అమ్ముకుంటున్నట్లు పోలీసులు విచారణలో బయటపడింది.
ఇక్కడ రిస్క్యూ చేసిన పిల్లలను తమ అసలు తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు పోలీసులు ప్రయత్నించినా అసలు తల్లిదండ్రులు ఎవరు ముందుకు రావడం లేదని పోలీసులు పేర్కొంటున్నారు. దీంతో కొందరు పిల్లలను విక్రయించే తల్లిదండ్రులు కూడా తమ చిరునామా తెలియకుండానే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఈ ముఠాల చేతిలో చిక్కి పిల్లలు కావాల్సిన వారు వారికి లక్షలు ఇచ్చి కొనుగోలు చేస్తూ చివరకు నేరస్థులుగా మారుతున్నారు. అందుకే చట్టబద్దంగా పిల్లలను దత్తతకు తీసుకోవాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు.