సిటీబ్యూరో:ఎల్పీజీ, సీఎన్జీ బ్లాక్ దందా నిర్మూలించాలని డిమాండ్ చేస్తూ ఆటో యూనియన్ నాయకులు నాచారంలో బుధవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నాచారం చౌరస్తా నుంచి మల్లాపూర్ ఇండియన్ గ్యాస్ బంక్ వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా బీఆర్టీయూ ఆటోయూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య మాట్లాడుతూ.. ఆటో గ్యాస్, సీఎన్జీ కొరతతో 15 రోజులుగా ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా లేదన్నారు. బ్లాక్‌దందా చేస్తూ బంక్ యాజమాన్యాలు ఆటో డ్రైవర్లను దోచుకుంటున్నాయని ఆరోపించారు.
ఇష్టానుసారంగా బంక్‌లు కొరతను కారణంగా చూపి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం ఆటో యూనియన్ నాయకుడు పాండు మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లకు ఇప్పటికీ ప్రభుత్వం ఇస్తానన్న ఏడాదికి రూ.12వేలు అందించలేదన్నారు. ఇల్లు గడవడమే డ్రైవర్లకు కష్టంగా మారిందని చెప్పారు.