మలక్‌పేట, మార్చి 4ః మలక్‌పేటలో ఆదివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన శిరీషది హత్యే నని తేలింది. శిరీషకు ఊపిరాడకుండా చేసి దిండు అదిమి చంపినట్లు భర్త వినయ్, ఆడపడుచు సరిత.. పోలీసుల ముందు ఒప్పుకున్నట్టు సమాచారం. శిరీషను ఒప్పించి తన తమ్ముడికి పెళ్లి సంబంధం కుదిర్చిన అక్కే చివరకు ఆమెను అంతమొందించిందని, పోలీసుల విచారణలో వినయ్ అక్క సరితే ప్రధాన హంతకురాలిగా తేలినట్లు సమాచారం.
భర్త విదేశాల్లో (ఒమన్)ఉంటుండటంతో సరిత అక్రమ సంబంధాల్ని కొనసాగిస్తున్నదని ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారం శిరీషకు తెలియటంతో ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. శనివారం రాత్రి శిరీషతో గొడవపడ్డ సరిత తీవ్రంగా కొట్టి, దిండుతో అదిమి హత్యచేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.
తనకు పెళ్లి కుదిర్చిన అక్కే చివరకు తన భార్యను అంతమొందించి తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందని, తన అక్క ఇంత పనిచేసిందా అని వినయ్ పోలీసుల ముందు పశ్చాతాప పడినట్లు సమాచారం. కాగా హత్య కేసులో తన అక్కకు వినయ్ కూడా సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. బుధవారం హంతకులిద్దరిని పోలీసులు మీడియా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.