జూబ్లీహిల్స్, జూలై 7: యూసుఫ్‌గూడలో పుట్ట రాము అలియాస్ సింగోటం రామన్న హత్య జరిగిన ఇంటిని ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులు సీజ్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఈ ఇంట్లో ఇమాం బీ, ఆమె కుమార్తె, మరికొంత మందితో కలిసి రామును హత్య చేశారు. ఈ కేసులోని నిందితులందరినీ అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. కాగా, ఈ హత్య అనంతరం అక్కడ జరుగుతున్న అక్రమ వ్యవహారాలపై అధికారులు దృష్టి పెట్టారు. ఖైరతాబాద్ తాసీల్దార్ నయీముద్దీన్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ జరిపి ఆ నివేదికను ఆర్డీఓకు పంపించారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ ఆర్డీఓ దశరథ్ సింగ్ రాథోడ్ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ కె.వెంకటేశ్వర్ రెడ్డి, రెవెన్యూ అధికారులు కలిసి ఈ నాలుగు అంతస్తుల భవనాన్ని సీజ్ చేశారు. ఎస్ఐలు రాకేశ్, గోపీ, పోలీస్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.