సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): నగరంలోని ఆర్టీఏ కార్యాలయాల్లో వాహనదారుల సేవల సమాచారం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లు పనిచేయడం లేదు. దరఖాస్తుదారులు పలు సేవల సమాచారం కోసం కార్యాలయాల్లోకి వస్తే సంబంధిత హెల్ప్డెస్క్ల్లో సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఏ సేవకు ఏం ఫాం అవసరం పడుతుందో తెలియక దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది.
బండ్లగూడ, కూకట్పల్లి, మేడ్చల్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లు అలంకారప్రాయంగా మారాయని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు పలు సేవలపై సుమారు 150 మంది వరకు వస్తుంటారు. వారికి కేటాయించిన స్లాట్స్ ఆధారంగా సేవలు పొందాల్సి ఉంటుంది.
కానీ హెల్ప్ డెస్క్ సిబ్బంది దురుసుగా మాట్లాడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కార్యాలయాల్లో దళారుల ప్రమేయం లేకుండా ఏ పని ముగియడం లేదని వాహనదారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సదరు కార్యాలయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.