2BHK House | సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఇల్లు కోల్పోయి గుండెలు అలిసిపోయిన బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లలోనూ సమస్యలే స్వాగతం పలికాయి. అధికారులు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో తాగునీరు లేక అవస్థలు పడుతున్నట్టు ఫాతిమా తెలిపింది. తమది ఉమ్మడి కుటుంబం అని.. ఇప్పుడు ఒకే డబుల్ బెడ్రూంలో ఉండలేకపోతున్నామంటూ ఓ మహిళా తన గోడు వెల్లబోసుకుంది.
హార్ట్ పేషెంట్ ఉన్న తనకు 7వ అంతస్తులో ఇల్లు కేటాయించారని మరో మహిళ తెలిపింది. ఫ్లోర్లకు గ్రిల్ లేకపోవడంతో మెట్లు దిగుతుంటే భయం వేస్తున్నదని బాధిత మహిళలు చెబుతున్నారు. చిన్నారులతో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నదని, అధికారుల దృష్టికి తీసుకొచ్చినా సమస్యను పరిష్కరించడం లేదని వాపోయారు. బాత్రూంల్లో మురుగు వెళ్లే పైపులు జాం అయిపోయి గదులన్నీ దుర్వాసనతో నిండుకుంటున్నాయని మహ్మద్ ఖాన్ అనే వ్యక్తి తెలిపాడు. నీళ్లు ఎప్పుడొస్తాయో తెలియని దుస్థితి పిల్లి గుడిసెలు డబుల్ బెడ్రూంల్లో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన వయస్సు 65 ఏండ్లని.. ఈ వయస్సులో 4 ఫ్లోర్లు దిగి కిందికి వెళ్లి నీళ్లు తీసుకొచ్చుకుంటామా? అని ప్రశ్నించారు. సమస్యలపై ప్రతిరోజూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఏ ఒక్కరూ వాటిని పరిష్కరించడంపై దృష్టి సారించడం లేదని విమర్శించారు. ఎన్నో ఏండ్లుగా ఉన్న తమ ఇండ్లను కూల్చేసి.. వద్దన్నా బలవంతంగా డబుల్ బెడ్రూంలు ఇచ్చారని.. కనీసం ఇందులోనైనా అన్ని వసతులు కల్పిస్తారనుకుంటే ఏదీ లేదని మూసీ బాధితులు వెల్లడించారు.
ఇండ్లను కూల్చడం మాకు నచ్చలేదంటూ అధికారుల వద్దే మొర పెట్టుకుంటున్నారు. కాగా, మూసానగర్, శంకర్ నగర్లో 150 ఇండ్లను అధికారులు నేలమట్టం చేసి… వారందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లకు తరలించినట్టు అధికారులు తెలిపారు. కాగా, రివర్‌బెడ్‌లో ఉన్న 2166 నిర్మాణాలు, బఫర్ జోన్లో 7,851 నిర్మాణాలను అధికారులు కూల్చబోతున్నారంటూ మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
మూసీని మించిన కంపు
మాది మూసానగర్. నా వయస్సు 63. ఎన్నో ఏండ్లుగా అక్కడే ఇల్లు నిర్మించుకొని ఉన్నాం. పిల్లలంతా మాతోనే ఉండేవాళ్లు. ఇప్పుడు మూసీ అభివృద్ధి పేరుతో మా ఇల్లును బలవంతంగా కూల్చేశారు. మాకు పిల్లిగుడిసెల్లో డబుల్ బెడ్రూం ఇచ్చారు. కానీ ఇక్కడే తాగునీరు సరిగా లేదు. బాత్రూం పైపుల నిర్వహణ సరిగా లేదు.
కంపును భరించలేకపోతున్నాం. తాగునీరు కూడా సరిగా రావడం లేదు. లిఫ్ట్‌లు పనిచేయవు. కిందకి దిగాలన్నా.. మీదకు రావాలన్నా నరకమే. ఎందుకు మాకు ఈ శిక్ష. ప్రశాంతంగా మా ప్రాంతంలో బతికే మాకు రేవంత్ సర్కార్ భరించలేని శిక్షను విధించింది. బంధువులు, స్నేహితులు కూడా మా ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. మా ఇంట్లో ఉన్నప్పుడు అందరూ వచ్చి చాయ్ తాగి ముచ్చట పెట్టి పోయేవాళ్లు. ఇప్పుడు నన్ను చూడటానికి నాలుగు అంతస్తులు ఎక్కే ఓపిక ఎక్కడిది.
-హరికాంత్, మూసీ బాధితుడు.