ఆ బెదిరింపు లేఖ వెనుక కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన కార్పొరేటర్ హస్తం వెలుగుచూసింది. ప్రాణాలు తీస్తామంటూ తానే లేఖ రాయించి తన ఇంట్లో వేయించుకున్న ఆ కార్పొరేటర్ ఆడిన దొంగ నాటకం బట్టబయలైంది. నగరంలో ఎక్కవ శాతం బస్తీలు ఉన్న ప్రాంతానికి చెందిన కార్పొరేటర్ కుట్ర అంతా పోలీసుల దర్యాప్తులో పటాపంచలైంది. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఆ కార్పొరేటరే తనతో ఆ బెదిరింపు లేఖను ఇంట్లో వేయించుకున్నాడని నిందితుడు చెప్పడంతో ఖంగు తినడం పోలీసుల వంతైంది. బీఆర్ఎస్ నేతలను అక్రమ కేసులో ఇరికించడంతో పాటు.. గన్‌మెన్‌ను కొనసాగించుకునేందుకు కార్పొరేటర్ ఆడిన డ్రామాగా పోలీసులు నిగ్గుతేల్చారు.
– సిటీబ్యూరో, డిసెంబర్ 9
నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన కార్పొరేటర్ ఇంట్లో గుర్తుతెలియని అగంతకుడు బెదిరింపు లేఖ వేసి వెళ్లాడు. ఆ కార్పొరేటర్‌ను త్వరలోనే చంపేందుకు నలుగురు బీఆర్ఎస్ నాయకులు ప్లాన్ చేసినట్లు ఆ లేఖలో ఉంది. దీంతో తనకు ప్రాణహాని ఉందంటూ సదరు కార్పొరేటర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కార్పొరేటర్ ఇంటిలో బెదిరింపు లేఖ విసిరిన వ్యక్తిని సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు బయటపడ్డాయి. పట్టుబడిన నిందితుడిపై గతంలో పలు కేసులు ఉన్నాయని..ఆ కేసుల నుంచి తప్పిస్తానని ఆ కార్పొరేటర్ భరోసా ఇచ్చి ఈ నాటకం ఆడించినట్లు పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. బెదిరింపు లేఖను వేయించుకున్నందుకు ఆ కార్పొరేటర్ వేరొకరి నుంచి కొంత డబ్బు ఇచ్చాడని పోలీసులకు లిఖిత పూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలిసింది.
తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని కార్పొరేటర్ ఒత్తిడి..
అయితే ఇప్పుడు ఆ లేఖ బీఆర్ఎస్ వాళ్లే వేశారని పోలీసుల ఎదుట వాంగ్మూళం ఇవ్వాలని తనపై సదరు కార్పొరేటర్ ఒత్తిడి చేస్తున్నట్లు బాధితుడు వాపోతున్నాడు. ఇది ఇష్టం లేని ఆ నిందితుడు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఓ మంత్రిని కలిసి తన గోడు వెళ్లబోసుకోవడంతో పాటు కార్పొరేటర్ విచిత్ర వైఖరిపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. పోలీసులను కూడా మ్యానేజ్ చేసేందుకు సదరు కార్పొరేటర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీ సపోర్ట్ ఉన్న కార్పొరేటర్ కావడంతో పోలీసులు కూడా కేసు విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. బెదిరింపు లేఖ వేయించుకున్నది సదరు కార్పొరేటరే అని రుజువైనా అరెస్ట్ చేయడానికి పోలీసులు జంకుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
కార్పొరేటర్‌కే వంతపాడుతున్న పోలీసుల అధికారి..!
సదరు కార్పొరేటర్‌కు ఖాకీ డిపార్ట్మెంట్లోని ఓ అధికారి వంతపాడ్తున్నట్లు తెలిసింది. అక్రమ కేసులో అప్రూవర్‌గా మారాలని తనపై ఆ అధికారి ఒత్తిడి చేస్తున్నట్లు నిందితుడు వాపోతున్నాడు. ప్రమేయం లేని కేసులో బీఆర్ఎస్కు చెందిన నలుగురు నాయలను ఇరికించేందుకు ఆ అధికారి ఆపసోపాలు పడ్తున్నట్లు డిపార్ట్మెంట్ వర్గాల్లో వినికిడి. ఈ క్రమంలో నిందితుడిపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నట్లు తెలియవచ్చింది. చట్టబద్దంగా వ్యవహరించాల్సిన ఆ అధికారి.. చట్టవ్యతిరేకంగా అరాచక కార్పొరేటర్‌కు కొమ్ముకాయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో కూడా అడ్డంగా బుక్ అయిన కార్పొరేటర్..
తన పై తానే రాళ్లదాడి చేయించుకుని తన ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులకు గతంలో కూడా ఇలానే తప్పుడు ఫిర్యాదు చేశాడు ఆ కార్పొరేటర్. గతంలో అతడి డివిజన్ పరిధిలో ఓ సభ జరిగేటప్పుడు తనకు తగలకుండా రాళ్లు వేయించుకొని.. తనకు ప్రాణహాని ఉందని పోలీసులను తప్పుదోవ పట్టించాడు. అప్పుడు కూడా పోలీసుల విచారణలో అసలు వాస్తవం బయటపడింది. నువ్వే దాడి చేయించకుని తప్పుడు ఫిర్యాదు చేస్తావా..తమాషాలు చేస్తున్నావా అని పోలీసులు గతంలో కూడా సదరు కార్పొరేటర్‌కు చివాట్లు పెట్టారు.
గన్‌మెన్ కొనసాగించుకునేందుకు చేసిన ఎత్తుగడే..!
ప్రాణహాని ఉంటే తప్ప నిబంధనల ప్రకారం కార్పొరేటర్ స్థాయిలో గన్‌మెన్ ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించవు. దాంతో తనకు ప్రాణహాని ఉందంటూ ఉత్తుత్తి బెదిరింపు లేఖను ఇంట్లో వేయించుకుని..గతంలో పనిచేసిన గన్మెన్నే కొనసాగించుకునేందుకు సదరు కార్పొరటేర్ ఆడిన నాటకమని పోలీసులు గ్రహించారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా బీఆర్ఎస్కు చెందిన నలుగురు తన రాజకీయ ప్రత్యర్థుల్ని జైలుపాలు చేయడంతో పాటు..గన్‌మెన్ కొనసాగించేందుకు చేసిన ఎత్తుగడగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తన స్వార్థం కోసం అమాయకుడిని ఇరికించిన కార్పొరేటర్‌తో పాటు, అక్రమ కేసులపై ఒత్తిడి తెచ్చి పోలీసుశాఖకు తలవంపులు తెచ్చే ఆ అధికారి పై తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.