సిటీబ్యూరో, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ) : ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు బాధితులకు నోటీసులతో ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ప్రాజెక్టు వెడల్పు, భూముల పరిహారాన్ని తేల్చకుండా ఓవైపు వేధింపులకు గురిచేస్తూనే, మరోవైపు భూములు ఇవ్వాలంటూ నోటీసులను జారీ చేస్తోంది. గతంలో భూ సేకరణ నోటీసులు, గ్రామ సభలను బాధితులు వ్యతిరేకించారు. తాజాగా మరోసారి బాధితులకు భూసేకరణ యంత్రాంగం వ్యక్తిగతంగా నోటీసులను అందజేస్తోంది.
ఏడాదిన్నర కాలంగా వేధింపులు..
హెచ్ఎండీఏ చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియ ఏ మాత్రం ముందుకు సాగడం లేదు. ప్రాజెక్టు వెడల్పును 150 ఫీట్లకు తగ్గించాలని, పరిహారం తేల్చేంత వరకు భూములు ఇచ్చేది లేదని బాధితులు తేల్చి చెబుతున్నారు. కానీ ప్రభుత్వం ఈ రెండు అంశాలు ప్రస్తావించకుండా యజమానుల నుంచి భూములు లాగేసుకోవాలని చూస్తోంది. దీంతోనే భూముల వ్యవహారం కొలిక్కి రావడం లేదు. కానీ ప్రభుత్వం మాత్రం బాధితులను ఏడాదిన్నర కాలంగా వేధిస్తూనే ఉంది.
తాజాగా నోటీసులతో మరోసారి భూ యజమానులను గందరగోళానికి గురిచేసేలా వ్యవహారిస్తోంది. రాజీవ్ రహదారి వెంబడి భూములు కోల్పోతున్న వారందరికీ తాజాగా నోటీసులు జారీ చేస్తున్నారు. గడిచిన నెల రోజులుగా స్తబ్ధుగా ఉన్న యంత్రాంగం.. ఒక్కసారిగా మరోసారి నోటీసులు తెరమీదకు తీసుకురావడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఎలివేటెడ్ ప్రాజెక్టును తాము వ్యతిరేకించడం లేదని, రాజీవ్ రహదారి భూ నిర్వాసితుల జేఎసీ స్పష్టంగా చెబుతున్నది. ప్రభుత్వం తమ వాదనలను పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నది. కోట్లు విలువ చేసి ఆస్తులతోపాటు, గడిచిన ఏడాది నుంచి రెంటల్ ఆదాయాన్ని నష్టపోయినట్లు వాపోతున్నది.