మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని 15 మండలాల్లో ఉన్న 616 చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం నడుం బిగించింది. హెచ్ఎండీఏ గుర్తించిన చెరువుల సంఖ్య ఆధారంగా ఇప్పటి వరకు 479 చెరువులపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి బఫర్ జోన్(ఎఫ్టీఎల్)ను నిర్ధారించారు. మిగిలిన చెరువులపైనా త్వరలో సర్వే చేయనున్నారు. ఎఫ్టీఎల్ గుర్తింపుతో చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు ఆస్కారం ఉండబోదని.. ఎవరైనా అతిక్రమించి నిర్మాణాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
మేడ్చల్, ఫిబ్రవరి 10, (నమస్తే తెలంగాణ): చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం నడుంబిగించింది. ప్రత్యేకంగా సర్వే చేపట్టి..బఫర్‌జోన్‌ను గుర్తించే పనిలో నిమగ్నమైంది. మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో 15 మండలాల్లో 616 చెరువులు ఉన్నాయి. వీటిని పరిరక్షించేందుకు సర్వే చేపట్టిన అధికారులు.. ఎఫ్టీఎల్ హద్దులను గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు 479 చెరువుల ఎఫ్టీఎల్ పరిధిని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో నిర్ధారించారు. మిగతా వాటల్లోనూ సర్వే ప్రక్రియ పూర్తి చేసి.. హద్దులను నిర్ధారిస్తామని అధికారులు వెల్లడించారు.
హెచ్ఎండీఏ అధికారులు గుర్తించిన చెరువుల సంఖ్య ఆధారంగా సర్వేను చేపట్టారు. జిల్లాలో 479 చెరువుల ఎఫ్టీఎల్ హద్దులను గుర్తించిన జిల్లా అధికారులు..ఈ మేరకు హెచ్ఎండీఏకు నివేదికను సమర్పించారు. దీంతో ఆ భూముల్లో ఇక అక్రమ నిర్మాణాలకు అవకాశం ఉండదు. కబ్జాదారులు ఎవరైనా నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. మరోవైపు చెరువులు కబ్జాలకు గురికాకుండా ప్రభుత్వం వాటిని పరిరక్షించడంతో పాటు సుందరీకరిస్తున్నది. చెరువు కట్టలను బలోపేతం చేసి మొక్కలు నాటి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తున్నది. మురుగునీరు చేరకుండా ప్రత్యేక నాలాలను నిర్మిస్తున్నారు.