సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : మహానగరంలో కాలుష్య ముప్పును కట్టడి చేయాల్సిన ప్రభుత్వం అదనంగా మరో 20వేల కొత్త ఆటోలకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాలుష్యానికి సంబంధించి ఈవీలను ప్రోత్సహిస్తామని డాంబీకాలు పలికిన సర్కార్.. వాటి కొనుగోలును ప్రోత్సహించకుండా పెట్రోల్, డీజిల్ ఆప్షన్‌తో కూడిన సీఎన్జీ, ఎల్పీజీల అమ్మకాలను డీలర్ల ద్వారా నడిపిస్తుండటంపై పర్యావరణ నిపుణుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే నగరంలో సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) కొరత తీవ్రంగా ఉందని బంక్‌ల నిర్వాహకులు చెబుతున్నారు. అదనంగా 20వేలు కొత్త ఆటోలు వస్తే పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పారు. ఇప్పటికే గ్రేటర్లో 1.40 లక్షల పెట్రోల్, డీజిల్ ఆటోలు ఉన్నాయి. పర్యావరణానికి హాని కలిగించే ఎటువంటి పెట్రోల్, డీజిల్, సీఎన్జీ (డీజిల్ ఆప్షన్) ఆటోలకు అనుమతి ఇవ్వవద్దని నిపుణుల కమిటీ గతంలో తేల్చింది.
ఉన్నవాటికి పర్మిట్ రూపంలో కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు అదనంగా 20వేల ఆటోలు నగర రోడ్లపై రాకపోకలు సాగించనున్నాయి. దీంతో కాలుష్యం తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మారెట్లో పెట్రోల్, డీజిల్ బంకులతో పాటు ఆటో గ్యాస్, సీఎన్ జీ, లిక్విడ్ గ్యాస్ కేంద్రాలు వేర్వేరుగా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 460 పైగా పెట్రోల్ బంకులు ఉండగా, అందులో 95 స్టేషన్లలో గ్యాస్ పంపులు అందుబాటులో ఉన్నాయి. మరో 25 కేంద్రాల్లో నేచురల్ గ్యాస్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. మహా నగరంలో వాహనాల సంఖ్య అక్షరాల 86 లక్షలు దాటిపోయింది. అందులో 10.35 లక్షల వరకు కార్లు ఉండగా, 1.46 లక్షల ఆటోరిక్షాలు, 80 వేల క్యాబ్ లు ఉన్నట్లు అధికార లెకలు స్పష్టం చేస్తున్నాయి.