సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్… 625 చదరపు కిలోమీటర్ల నుంచి 2,050 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో రేపు స్టాండింగ్ కమిటీ ముందు మహా బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్ మహా నగరంలో దాదాపు అభివృద్ధి పడకేసిన దరిమిలా రానున్న ఆర్థిక సంవత్సరం పెద్ద ఆశాజనకంగా ఏమీ కనిపించడం లేదు. ప్రధానంగా రానున్ ఫిబ్రవరి పదితో పాలక మండలి గడువు తీరనుంది. ప్రభుత్వం వెంటనే ఎన్నికలకు వెళుతుందా? కొన్ని నెలలు వేచి చూస్తుందా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు సాదాసీదాగానే అంకెల్ని పేర్చి బడ్జెట్‌ను ముగిస్తున్నట్లు తెలుస్తున్నది.
గతంలోని గ్రేటర్ బడ్జెట్… విలీన స్థానిక సంస్థల్లోని బడ్జెట్‌ను ఒకచోట కూర్చి రూ.11,400-11,500 కోట్ల మధ్య మహా బడ్జెట్‌ను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా గత ఆర్థిక సంవత్సరంలో సవరణ బడ్జెట్ పరిమాణం రూ.11,010 కోట్లుగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.3వేల కోట్లలో కోతనే పడటం గమనార్హం. ఈ క్రమంలో 2025-26లో రూ.700 కోట్ల రుణాలకు అంచనా వేసిన గ్రేటర్… మరో రూ.183 కలుపుకొని అప్పులు తెచ్చుకుంది. అందుకే రానున్న ఏడాదిలోనూ రాష్ట్ర సర్కారుపై పెద్దగా ఆశలేమీ పెట్టుకోలేదు. మునుపటికంటే కేవలం రూ.100 కోట్లు మాత్రమే అదనంగా ఆశిస్తున్న జీహెచ్ఎంసీ… రుణాలను మాత్రం గతం కంటే అదనంగా వంద కోట్లు తెచ్చుకోవాలని అంచనా వేస్తున్నది.
జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. మొదట జీహెచ్ఎంసీ వరకే రాబోయే ఏడాది (2026-27)కు సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ ఇటీవల శివారు 27 పురపాలికలు జీహెచ్ఎంసీలో విలీనమై 300 వార్డులుగా మహా గ్రేటర్‌గా జీహెచ్ఎంసీ ఏర్పడింది. 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లు ఉన్న జీహెచ్ఎంసీ మొత్తానికిగానూ కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27)కు మెగా బడ్జెట్ రూపకల్పన చేశారు. రూ. 11వేల కోట్లకు పైగా బడ్జెట్‌ను సిద్దం చేసి ఈ నెల 29 (సోమవారం)న జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశం ముందుకు ఈ ప్రతిపాదనను అధికారులు పెట్టనున్నారు. ఈ మేరకు సభ్యులను బడ్జెట్ బుక్‌ను అందజేసినట్లు తెలిసింది. సభ్యుల ఆమోదం మేరకు బడ్జెట్‌ను ఆమోదించుకుని ఆ తర్వాత ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించి అందులో ఆమోదించనున్నారు. ఆనంతరం ప్రభుత్వానికి అందజేయనున్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.11 వేలకు కోట్లకు పైగా మెగా బడ్జెట్‌ను అధికారులు సిద్ధం చేశారు. వర్తమాన ఆర్థిక సంవత్సరం (2025-26)నకు సంబంధించి రూపొందించిన రూ. 10,910ల కోట్ల బడ్జెటతో పోల్చితే కొత్త వార్షిక బడ్జెట్ రూ 400 కోట్లకు పైగా పెంచి రూ. 11 వేలకు కోట్లకు పైగా రూపకల్పన చేశారు. ఇటీవలే జీహెచ్ఎంసీలో విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థల అసరాలు, అభివృద్ది, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ఈ బడ్జెట్ ముసాయిదాను రూపొందించినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ ముసాయిదాను ఈ నెల 29న జరగనున్న స్టాండింగ్ కమిటీ ముందు ప్రవేశపెట్టనున్నారు.
స్టాండింగ్ కమిటీ అభిప్రాయాలను స్వీకరించనున్న అధికారులు ప్రస్తుత బడ్జెట్ ముసాయిదాలో అవసరమైన స్థాయిలో మార్పులు చేర్పులు చేయనున్నారు.. కాగా, విలీన పురపాలికల్లో ఆదాయం, పెరగనున్న ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్, ట్రేడ్ లైసెన్స్ చార్జీలతో పాటు ప్రధాన ఆర్థిక వనరుల్లో ఒకటైన భవన నిర్మాణ అనుమతుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరుతున్నందున ఈ సారి రెవెన్యూ ఆదాయాన్ని రూ. 6వేల కోట్లకు పైగా పొందుపరిచారు. దీనికి తగినట్టుగానే రెవెన్యూ వ్యయాన్ని కూడా సుమారు రూ. 4 వేల కోట్లకు పైగా పేరొనడం గమనార్హం.