ఖైరతాబాద్, మే 19 : ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీ జరుగుతున్నదని, నియంత్రణా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. ఎంవీ ఫౌండేషన్, టీచర్స్ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సంయుక్తాధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అధిక ఫీజుల నియంత్రణపై రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగింది.
ఎంవీ ఫౌండేషన్ చీఫ్ కోఆర్డినేటర్ వై. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణలో ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చిన ప్రైవేట్ విద్యాసంస్థలు అడ్డూ అదుపు లేకుండా ఫీజుల భారాన్ని తల్లిదండ్రులపై వేస్తోందన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ వ్యాపారంగా మారిపోయిందన్నారు. రాష్ట్రంలో 36 లక్షల మంది విద్యార్థులు వివిధ పాఠశాలల్లో చదువుకుంటున్నారని, తల్లిదండ్రుల ఫీజుల భారం వర్ణణాతీతమన్నారు.
చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కన్వీనర్ జి. వేణుగోపాల్ మాట్లాడుతూ విద్యార్థుల నుంచి ఫీజులే కాకుండా బలవంతంగా యూనిఫాం, బూట్లు, నోట్‌పుస్తకాలు, టై, బ్యాడ్జీలు, స్పోర్ట్స్ డ్రస్ అంటూ మరింత దోచుకుంటున్నారన్నారు. హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటసాయినాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏటా దాదాపు రూ.20వేల కోట్లనుంచి రూ.30వేల కోట్ల విద్యావ్యాపారం సాగుతుందన్నారు. మథర్స్ అసోసియేషన్ కన్వీనర్ జి. భాగ్యలక్ష్మి, నెట్వర్క్ ప్రొటెక్షన్ ఫర్ చైల్డ్ రైట్స్ కోఆర్డినేటర్ ఎస్. నాగరాజు, టీచర్స్ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కన్వీనర్ జనార్దన్ పాల్గొన్నారు.