నగరవాసుల గొంతెండుతోంది.. ఇండ్లలో బోర్లు ఎండిపోయి.. జలమండలి సరఫరా అరగంట కూడా రాక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అట్టడుగుకు భూగర్భ జలాలు పడిపోవడంతో.. నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శివారు ప్రాంతాలు, ఓఆర్ఆర్ సరిసరాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నది. కానీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు. ఇక అద్దెకుండే పేద, మధ్య తరగతి ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నది. ఐదారు కుటుంబాలు ఉండే మూడు, నాలుగు ఫ్లోర్ల అపార్ట్మెంట్లలో ఉన్న ఒక్క బోరు ఎండిపోవడంతో పాటు ఇంటి యజమానులు నీటిని ఎక్కువగా వాడొద్దనడంతో అవస్థలు పడుతున్నారు. బస్తీల్లో నీళ్లు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారడం.. ఇండ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలనే అవగాహన కల్పించకపోవడంతో నీటి
సమస్యలు రెట్టింపయ్యాయని ప్రజలు మండిపడుతున్నారు.
భూగర్భ జలాలు నగరంలో యావరేజిగా ఉపరితలం నుంచి 9 మీటర్ల దిగువకు పడిపోయాయి. నగర శివారు ప్రాంతాలు, ఓఆర్ఆర్ సరిసరాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నది.
సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : జలమండలి అధికారుల నిర్లక్ష్యం నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఈ ఏడాది మే నెలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఫిబ్రవరిలోనే వాతావరణ శాఖ అధికారులు పదే పదే హెచ్చిరించినా పట్టించుకోకపోవడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మార్చి నెల దాకా నీటి సమస్య లేదని గొప్పగా చెప్పుకొంటూ వచ్చిన అధికారులు ఏప్రిల్, మే నెలల్లో భానుడి ప్రతాపం చూపించడంతో మౌనం వహించారు. మే ద్వితీయార్థం నుంచి నేటి దాకా ఎండలు తీవ్రమవడంతో భూగర్భ జలాలు పాతాలాని పడిపోయాయి.
ఆ సమయంలో నగరంలో పరిస్థితులపై సమీక్ష చేసిన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎక్కడా తాగునీటి సమస్య లేదు.. అంతా సస్యశామలంగానే ఉందని సెలవిచ్చారు. పక్కనే ఉన్న ఉన్నతాధికారులు సైతం ప్రజలు బిందెలు పట్టుకుని జలమండలి ప్రధాన కార్యాలయాన్ని ముట్టిడించినా మంత్రి మాటలకు వంతపాడారు. ఇప్పుడు జూన్ నెల వచ్చినా నగరంలో నీటి సమస్య ప్రమాదకరంగానే ఉన్నది. ఎక్కడ చూసినా నీళ్ల కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారు.
ఇండ్లలో బోర్లు ఎండిపోయి.. జలమండలి సరఫరా అరగంట కూడా రాకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉన్నతాధికారులు కనీసం క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ జలాలు నగరంలో యారేజిగా ఉపరితలం నుంచి 9 మీటర్ల దిగువకు పడిపోయాయి. నగర శివారు ప్రాంతాలు, ఓఆర్ఆర్ సరిసరాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నది. కానీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు. ఇండ్లలో బోర్లు ఎండిపోయి.. నల్లా నీళ్లు నిమిషాల పాటు కూడా రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అద్దెకుండే పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి దారుణంగా తయారైంది. ఐదారు కుటుంబాలు ఉండే మూడు, నాలుగు ఫ్లోర్ల అపార్ట్మెంట్లలో ఉన్న ఒక్క బోరు ఎండిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
ఇంటి యజమానులు నీటిని ఎక్కువగా వాడొద్దనడంతో అవస్థలు పడుతున్నారు. బస్తీల్లో నీళ్లు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఐదు, పది నిమిషాల పాటు వచ్చేవి కూడా ఎప్పుడొస్తాయో తెలియక రోజంతా పనులకు పోకుండా కాపలా ఉండాల్సిన దుస్థితి నెలకొన్నది. ఇంట్లోని ఒక వ్యక్తి కేవలం నీళ్లు పట్టుకునేందుకే రోజంతా పనులు మానుకుని ఉంటున్నారు. నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారడం.. ఇండ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలనే అవగాహన జలమండలి కల్పించకపోవడంతో నీటి సమస్యలు వస్తున్నాయి.
ప్రజలకు నీటి సమస్యలు లేకుండా చూస్తున్నామని చెప్తున్న జలమండలి ఉద్యోగులు భూగర్భ జలాలు అడుగంటితే చేతులెత్తేస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ప్రజల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో క్షేత్రస్థాయి సిబ్బంది నీటిని ఇష్టారీతిన అమ్ముకుంటూ పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తమ అనుకూలమైన వాళ్లకు రోజంతా సరఫరా చేస్తూ పేదలకు మాత్రం అర్ధగంట కూడా సరఫరా చేయడంలేదని వాపోతున్నారు. ఈ కొద్దిరోజులైనా తాగునీటిని సక్రమంగా ఇవ్వాలని వేడుకుంటున్నారు.