SNDP | సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ ప్రభుత్వం నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి) పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విపరీతంగా కాలయాపన చేస్తున్నది. నిర్దేశిత లక్ష్యంలోపు పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు నెలల తరబడి జాప్యం అవుతున్నాయి. దీంతో ముఖ్యమైన కూడళ్లలో నిత్యం నగరవాసులు నగర యాతన పడుతున్నారు.
ఒక్క వంతెనకే 96 కోట్లు పెంచారు
వేర్వేరు కారణాలు చూపించి అధికారులు ప్రతి ప్రాజెక్టులో 20 నుంచి 30 శాతం పెరుగుదల చూపిస్తున్నారు. దీంతో ఖజానాపై భారం పడుతున్నది. నల్గొండ క్రాస్ రోడ్ నుంచి సైదాబాద్, ఐఎస్ సదన్ -ఓవైసీ జంక్షన్ కారిడార్ వరకు నిర్మితమవుతున్న స్టీల్ బ్రిడ్జి ప్రాజెక్టు వ్యయం రూ.523.37 కోట్లు ఉంటే ఇటీవల రూ. 620 కోట్లకు పెంచారు. జీహెచ్ఎంసీ ఖజానాపై రూ. 96.63 కోట్ల భారం పడడమే ఇందుకు నిదర్శనం . ఇప్పటికే సైదాబాద్ స్టీల్ బ్రిడ్జితో పాటు శాస్త్రీపురం, ఫలక్‌నుమా ఆర్వోబీ ప్రాజెక్టులు అందుబాటులోకి రావాల్సి ఉన్నప్పటికీ పనులపై తీవ్ర జాప్యం నెలకొంది.
అంతేకాకుండా శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ పనులకు నేటికీ భూ సేకరణ చిక్కులు తొలగడం లేదు. మొత్తంగా 5 చోట్ల ప్రాజెక్టులకు నిర్దేశిత లక్ష్యాలను ఖరారు చేసినప్పటికీ సకాలంలో అందుబాటులోకి రావడమే కష్టమేనని స్వయంగా అధికారులే చెబుతున్నారు. పనుల్లో వేగం పెంచాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండడంతో ప్రాజెక్టు ఖర్చు పెరగడంతో పాటు ట్రాఫిక్ కష్టాలు అధికమవుతుండడం పట్ల నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఎస్ఆర్డీపీ తొలి విడత పథకాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నత్త నడకన శిల్ప లేఅవుట్ ఫేజ్-2
శేరిలింగంపల్లి, మార్చి 03: ఎస్ఆర్డీపీ కింద చేపట్టిన 17వ ప్రాజెక్ట్, శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ ఫేజ్-2 పనులు నత్తనడకన సాగుతున్నాయి. మార్చి నెలాఖరుకు పూర్తి కావాల్సిన తుది దశ నిర్మాణ పనులు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో పనులు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా స్థల సేకరణ పనులు ఆలస్యమై తీవ్ర జాప్యం తలెత్తడంతో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు పేజ్ 2లో భాగంగా ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వరకు 816 మీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో మరో పని జరుగుతోంది. కొండాపూర్ వైపు అప్ ర్యాంప్ 475 మీటర్ల పొడవు మరియు 12 మీటర్ల వెడల్పు ఫ్లైఓవర్, కొండాపూర్ నుండి గచ్చిబౌలి వరకు డౌన్ ర్యాంప్ 305 మీటర్ల పొడవు మరియు 12 మీటర్ల వెడల్పుతో చేపట్టాల్సి ఉంది.
ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ ఇంకెప్పుడో..
గడిచిన ఏడాది కాలంలో ఎస్ఆర్డీపీ పనుల పురోగతిలో వేగం మందగించింది. ఈ నేపథ్యంలోనే శాస్త్రీపురం (రూ.71కోట్లు), ఫలక్‌నుమా ఆర్వోబీ రూ.47.10కోట్లు, శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ స్టేజ్-2 రూ. 275కోట్లు, నల్గొండ క్రాస్‌రోడ్ స్టీల్ బ్రిడ్జి రూ. 370 కోట్లతో పనులు నడుస్తున్నాయి. ఉప్పల్ జంక్షన్ ఫ్లై ఓవర్ రూ. 311 కోట్లతో చేపట్టగా, ప్రాజెక్టు పూర్తి అయ్యే నాటికి మరో 30శాతం మేర అదనంగా భారం ఖజానాపై పడే అవకాశాలు లేకపోలేదు. మొత్తంగా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారడం, టెండర్ల పిలుపు నుంచి సంబంధిత ప్రాజెక్టు పనులను నిర్ణీత కాలంలో పూర్తి చేయలేకపోతున్నారు. సీఈ నుంచి ఎస్ఈలను అదనపు బాధ్యతల భారాన్ని తగ్గించి ఇంజనీరింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, ఈ దిశగా కమిషనర్ చొరవ తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు
కేసీఆర్ హయాంలో జెడ్ స్పీడ్‌లో..
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వం సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా ప్రభుత్వం రూ.5937కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ 42 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. 42 ఫ్లై ఓవర్లలో 37 చోట్ల పనులు వాయువేగంతో పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. బీఆర్ఎస్ హయాంలోనే 95 శాతం మేర పురోగతి లో ఉన్న పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఎల్బీనగర్ భైరామల్‌గూడ సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్, కుడివైపు లూప్ కవర్, ఎడమ వైపు లూప్ ఫ్లై ఓవర్లతో పాటు జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు చేపట్టిన ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చాయి.
ఎడతెగని జాప్యంతో..
చంచల్‌గూడ ప్రభుత్వ ముద్రణాలయం చౌరస్తా నుంచి సంతోష్‌నగర్ ఒవైసీ చౌరస్తా వరకు నాలుగు లైన్ల రోడ్డును 320 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన నాలుగు కిలోమీటర్ల చేపట్టిన స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను 2020 జూలై 23న అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. స్టీల్ బ్రిడ్జిలో 88 పిల్లర్లతో ఏర్పాటు చేస్తున్న పనులతీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.