ఖైరతాబాద్, మే 3 : గోవధ నిషేధ చట్టాన్ని కచ్చితంగా పాటించాలని హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యుగ తులసీ ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు కొల్లేటి శివకుమార్ ఆదివారం ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లోని శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఆమరణదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో విచ్చలవిడిగా గోవద జరుగుతుందని, గోవులను రవాణా చేయడంతో పాటు అక్రమంగా కబేళాలకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం గోరక్షకులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వ, పోలీసు యంత్రాంగం పట్టించుకోవడం లేదన్నారు.
గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా అమలు చేయడంలో రేవంత్ సర్కారు విఫలమైందన్నారు. న్యాయ స్థానం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోకుండా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం గోవదను పరోక్షంగా ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.హైకోర్టు పిల్ నం.5/2023 ప్రకారం రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన గోవుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలన్నారు. అలాగే రాబోవు ఒక వర్గానికి సంబంధించిన పండుగ నేపథ్యంలో అక్రమ గోవధ జరిగే అవకాశం ఉందని, తక్షణమే అలాంటి చర్యలకు పాల్పడుతున్న స్లాటర్ హౌజ్‌లను మూసివేయాలని, ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేయాలన్నారు.కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఆమరణ దీక్ష కొనసాగుతుందన్నారు. కాగా, ఈ దీక్షకు శ్రీనివాస్ ప్రసాద్, చంద్రస్వామి, పురుషోత్తం గుప్తా, సంగమేశ్వర చారి, పవన్ కల్యాణ్, శ్రవణ్ రెడ్డి, శంకర్ యాదవ్, బాలజీ సంఘీభావం తెలిపారు.