ఈ అక్రమాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు బయటికి రావడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతున్నది. కానీ విచారణను తొక్కిపెట్టేందుకు తెర వెనుక భారీ ఎత్తున ప్రయత్నాలు మొదలైనట్లు తెలిసింది. కంటి తుడుపు చర్యగా విచారణ ముగించేందుకు ఉద్యోగ నేతలే కొందరు ప్రభుత్వస్థాయిలో ఒత్తిళ్లు మొదలుపెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి వీటంతటికీ కారణం… ఏమాత్రం ముందుచూపు, ప్రణాళిక లేకుండా, హడావిడిగా చేసిన విలీన ప్రక్రియ అని పలువురు రిటైర్డ్ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మణికొండ, డిసెంబర్ 11
అవుటర్ రింగు రోడ్డు వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (కోర్ ఏరియా)గా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియ భారీ అవకతవకలకు ఆస్కారం ఇచ్చింది. గతంలోనూ కేవలం ఖజానాకు ఆదాయం సమకూర్చుకునేందుకు ఎలాంటి పటిష్ట చర్యలు లేకుండా చేపట్టిన ఎల్ఆర్ఎస్ ఎలా అవినీతికి వేదికగా మారిందో ఇప్పుడు ఈ విలీన ప్రక్రియ కూడా అంతకంటే మించి అవకతవకలకు మార్గాన్ని సుగమం చేసింది. హైదరాబాద్ పరిధిలోకి ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలను విలీనం చేయాలని ముందు నుంచి ప్రభుత్వం అనుకుంటున్నదే. విలీన దశలో పెద్ద ఎత్తున అక్రమాలకు ఆస్కారం ఉంటుందనే విషయం తెలిసినప్పటికీ దానిపై అటు సర్కారుగానీ ఇటు ఉన్నతాధికారులుగానీ ఏ మాత్రం దృష్టిసారించలేదు. విలీన ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఆయా స్థానిక సంస్థల్లోని దస్ర్తాలను సమీపంలోని జీహెచ్ఎంసీ జోన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇ
దే పెద్ద ఎత్తున అక్రమాలకు బాటలు వేసిందని ఓ సీనియర్ రిటైర్డ్ అధికారి తెలిపారు. వాస్తవానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే ముందు అకస్మాత్తుగా దస్ర్తాలను స్వాధీనం చేసుకోవడం, ఆన్లైన్లో సంబంధిత వెబ్‌సైట్‌లోని సేవలన్నింటినీ నిలిపివేసిన తర్వాత ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇందుకు భిన్నంగా పుష్కలమైన సమయం ఇవ్వడంతో ఆలోగా కార్పొరేషన్, మున్సిపాలిటీ అధికారులు రేయింబవళ్లు శ్రమించి ‘సంతృప్తి’కరంగా సర్కారు ఖజానాకు గండి కొట్టడంతో పాటు అక్రమ నిర్మాణాలకు ఆస్కారం కల్పించారని సదరు రిటైర్డ్ అధికారి అన్నారు. అవకతవకలన్నీ పుష్కలంగా చేసిన తర్వాత ఆ దస్ర్తాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఒరిగే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు.
విలీన ప్రక్రియ చివరి దశలో నగరం చుట్టూ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లలో జరిగిన అక్రమాల తీరు చూస్తుంటే వీటిని విచారించేందుకు నెలల సమయం పడుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అడ్డగోలుగా నిర్మాణ అనుమతులు ఇవ్వడం ఒకవంతైతే… ఎడాపెడా ఓసీలు జారీ చేశారు. ఇంకొన్నిచోట్ల ఏకంగా నిధులను నాలుగు రోజుల్లోనే పంచుకు తిన్నారనే ఆరోపణలు ఉన్నాయి. మొక్కలు నాటడం వంటి పనులు మొదలు పారిశుధ్యం, రోడ్లు వేయడం వంటి పనులను టెండర్లు లేకుండా ఉండేందుకు లక్ష వరకు మాత్రమే అంచనాలు రూపొందించడంతో పాటు కమిషనర్లకు రూ.5 లక్షల వరకు అధికారిక వెసులుబాటును సైతం ఆసరాగా చేసుకొని కోట్లాది రూపాయల పనులను గంటల వ్యవధిలోనే రూపొందించడం, ఎంబీ రికార్డులు పూర్తి చేయడం, చెక్కులు ఇవ్వడం వంటి ప్రక్రియలన్నీ పూర్తి చేయడమంటే ఎంత పకడ్బందీగా ఖజానాకు గండికొట్టారో అర్థమవుతుంది.
ముఖ్యంగా కొందరు కమిషనర్ల మధ్యనే వీటికి సంబంధించి జరిగిన సంభాషణలు విస్తుగొలుపుతున్నాయని ఓ ఉన్నతాధికారి అన్నారు. తన పరిధిలో కేవలం 20 ఓసీలు మాత్రమే ఇవ్వగలిగానని, పక్క కార్పొరేషన్లో 50 వరకు ఇచ్చినట్లు తెలిసిందని ఓ కమిషనర్ బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చని సదరు అధికారి వ్యాఖ్యానించారు.
ఈ అక్రమాలపై ఆరోపణలు గుప్పుమనడంతో ప్రభుత్వం రాష్ట్రస్థాయి విజిలెన్స్‌ను విచారణకు పురమాయించింది. ఈ మేరకు గత నాలుగు రోజులుగా విజిలెన్స్ అధికారులు ఆయా కార్పొరేషన్లలోని దస్ర్తాలను స్వాధీనం చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల పాలకమండలి గడువు ముగిసిన తర్వాత నుంచి జరిగిన ప్రక్రియపైనా దృష్టిసారించినట్లు తెలిసింది. అయితే విచారణ అధికారులు వచ్చే ముందు ఆయా కార్పొరేషన్లలో చాలా మేరకు జాగ్రత్తపడినట్లు తెలుస్తున్నది. అయినప్పటికీ లోతుగా విచారిస్తే మాత్రం కచ్చితంగా అవినీతి బండారం బయటపడుతుందని అధికారులే చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సమగ్ర, లోతైన విచారణ జరగాలంటే చాలారోజులు పడుతుందని, ప్రభుత్వం చిత్తశుద్ధితో విచారణకు ఆదేశిస్తే తప్ప..విజిలెన్స్ విచారణకు సార్ధకత ఉండదంటున్నారు. ఆరోపణలు బయటికొచ్చిన దరిమిలా విజిలెన్స్ అధికారులు హడావిడి చేసి విచారణ చేపట్టినా ఇదెంత వరకు ముందుకు సాగుతుంది? ఎంతమేరకు అవినీతి నిగ్గుతేలుస్తుంది? అనే దానిపై ఉన్నతాధికారులే పెదవి విరుస్తున్నారు. కాగా, విజిలెన్స్ విచారణపై యంత్రాంగంలో కొంత ఆందోళన వ్యక్తమవుతున్న దరిమిలా పలు సంఘాల ఉద్యోగ నేతలు కూడా రంగంలోకి దిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కార్పొరేషన్లలో ఉండే ఆయా స్థాయి అధికారులకు సంబంధించి ప్రత్యేకంగా యూనియన్లు ఉన్నాయి. వీరంతా రంగంలోకి దిగి విజిలెన్స్ విచారణను తొక్కి పెట్టే దిశగా ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ, వివాదాస్పద భూముల్లో కించిత్తు క్షేత్రస్థాయి విచారణ లేకుండా అడ్డగోలుగా నిర్మాణ అనుమతులు… అసలు భవన నిర్మాణం పూర్తి కాకుండానే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ… భారీ భవనాలకు తప్పుడు ఆస్తి పన్ను అంచనాలు… గతంలో చేసిన పనులనే లక్ష రూపాయల చొప్పున విభజించి మళ్లీ పనులు చేసినట్లు బిల్లుల చెల్లింపు… ఇదీ ఇటీవల జీహెచ్ఎంసీలో విలీనమైన ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల పరిధిలో అధికార యంత్రాంగం సర్కారు ఖజానాకు భారీ ఎత్తున గండికొట్టిన తీరు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు! అధికారిక విలీనానికి కొన్ని గంటల ముందే పనులన్నీ చక్కబెట్టుకున్నారు. ఏండ్ల తరబడి ప్రజల సమస్యలపై ఏనాడూ ఒక్క నిమిషం ఎక్కువ పని చేయని యంత్రాంగం.. జీహెచ్ఎంసీలో విలీనమవుతున్న నేపథ్యంలో నాలుగు రోజుల పాటు రేయింబవళ్లు… పని చేశారు. కోట్లాది రూపాయలు సర్దుకున్నారు.