కుత్బుల్లాపూర్, జూన్ 20: కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ.. నానా నరకయాతన పెడుతూ.. రాష్ర్టాన్ని అదోగతి పాలు చేస్తున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శనివారం చింతల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాక్షస పాలన కొనసాగుతున్నదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న రోజుల్లో వ్యవసాయాన్ని పండగలా మార్చారని గుర్తు చేశారు.
సకాలంలో విత్తనాలు, యూరియా అందించడమే కాకుండా సమయానికి రైతు బంధు డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో వేసి, పండించిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేశారన్నారు. కానీ నేడు రేవంత్‌రెడ్డి రాక్షస పాలనలో రైతులకు నరకం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి విత్తనాలు లేవని, యూరియా కోసం రైతులు రోడ్లపై పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కింద డబ్బులు ఇవ్వలేదని, అన్నదాత కష్టపడి ధాన్యం పండిస్తే దద్దమ్మ రేవంత్ ప్రభుత్వానికి కొనుగోలు చేయడానికి చేతగావడం లేదన్నారు. సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలో ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేయలేదన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ పీఎసీఎస్ పరిధిలో 632 మంది రైతులు దరఖాస్తు చేసుకుంటే.. కేవలం 13 మందికే రుణమాఫీ అయిందంటే ఈ ప్రభుత్వం ఎంతటి ఘరానా మోసానికి పాల్పడిందో అర్ధమవుతున్నదన్నారు. దేవుళ్లపై ఒట్టు వేస్తూ ప్రగల్బాలు పలుకుతున్న రేవంత్‌రెడ్డికి అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ సవాల్ విసిరిందని, మీ సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోదాం..అక్కడ రుణమాఫీ సంపూర్ణంగా అయిందని నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని చెబితే, తోక ముడుచుకొని పారిపోయిన చేతగాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని విమర్శించారు.
రైతు డిక్లరేషన్ తుంగలో తొక్కారు..
రేవంత్‌రెడ్డి ఢిల్లీ నుంచి రాహుల్‌గాంధీని తీసుకొచ్చి రైతు డిక్లరేషన్ పేరిట హామీలు ఇప్పించారని గుర్తు చేశారు. రైతు బంధును రూ.15 వేలు చేస్తామని, పండించిన ప్రతి పంటను చివరి గింజ వరకు కొంటామని చెప్పి.. ఇవాళ ఆ డిక్లరేషన్‌ను పూర్తిగా తుంగలో తొక్కారని మండిపడ్డారు. గతంలో పిసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒడ్లు కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొనదా అని ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి..ఇవాళ కేంద్రం ఎంత కొంటే మేమూ అంతే కొంటాం అనడం సిగ్గుచేటన్నారు. కేంద్రం కొనకపోతే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి ముందు ఒడ్లు పోస్తానని శపథం చేసిన రేవంత్‌రెడ్డి ..ఇవాళ ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లగానే భయపడి, బెదిరిపోయి మోకాళ్లపై పడి సాష్టాంగ నమస్కారం చేసి సరెండరయ్యారని విమర్శించారు. రైతు భరోసా కింద రూ. 15 వేల నగదును ఖాతాల్లో వేయాలని, పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలన్నారు.