ఖైరతాబాద్, డిసెంబర్ 18 : ‘అత్యవసర పరిస్థితుల్లో నిమ్స్‌కు వెళ్తున్నారా’.. జర ఆగండి..అక్కడ అంత సులువుగా బెడ్లు దొరకవు.. అదేమి మాయనోగాని, కొందరు బ్రోకర్లను పట్టుకొని అందినంత ఇచ్చుకుంటే బెడ్లు, వెంటిలెటర్లు అలా ప్రత్యక్షమవుతాయని పబ్లిక్ టాక్. అర్ధరాత్రి వేళ ఎవరైనా ప్రాణపాయ స్థితిలో నిమ్స్‌కు వెళితే.. పుణ్యకాలం కాస్తా అక్కడి సిబ్బందిని కాళ్లా వేళ్లా పట్టుకోవడానికే సరిపోతుంది. ఆ లోపు ఆ రోగి ఊపిరి ఆగిపోతుంది. దవాఖానలోని కొందరు వైద్యులు, సిబ్బంది చర్యలతో రోగుల ప్రాణాలకు వైద్యపరమైన రక్షణ లేకుండా పోతున్నది.
తాజాగా నిమ్స్‌లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే….కల్వకుర్తికి చెందిన ఒక రోగి అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు బుధవారం అర్ధరాత్రి నిమ్స్ దవాఖానకు తీసుకువచ్చారు. ఎమర్జెన్సీ వార్డు వద్దకు వెళ్లగా, ఆ రోగిని పరిశీలించిన వైద్యులు.. ఇక్కడ బెడ్లు ఖాళీలేవు.. వేరే దవాఖానకు తీసుకెళ్లాలంటూ సలహా ఇచ్చారు. అయితే అక్కడే ఉన్న ఓ డ్యూటీ డాక్టర్ ఫలానా కార్పొరేట్ దవాఖానకు వెళ్లాలంటూ.. చెప్పడంతో ప్రైవేట్ దవాఖానల్లో అడ్వాన్స్ రూపంలో లక్షలు అడుగుతున్నారని, ఆ డబ్బులు కట్టుకోలేకనే నిమ్స్‌కు వచ్చామంటూ రోగి కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు.
నిమ్స్‌లో చేర్చుకోవాలంటూ కాళ్లా వేళ్లా పడి బతిమిలాడారు. అయినా కనికరించకుండా ఆ రోగికి వెంటిలేటర్ అవసరం ఉంటుందని, తమ వద్ద వెంటిలెటర్ బెడ్స్ ఖాళీగా లేవని డ్యూటీ డాక్టర్ చెప్పడం గమనార్హం. దీనిపై రోగి కుటుంబసభ్యులు అక్కడి సిబ్బందిని గట్టిగా నిలదీయడంతో ఎట్టకేలకు రోగిని చేర్చుకున్నట్లు తెలిసింది. ఈ ఉదంతాన్ని వీడియో తీసిన బాధితుల బంధువు ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.
అందరికీ బెడ్లు కేటాయించాలంటే కష్టం : డాక్టర్ సత్యనారాయణ, సూపరింటెండెంట్
నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో వందకు పైగా సాధారణ బెడ్లు, 50 వరకు వెంటిలేట్లు ఉన్న బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ఎమర్జెన్సీ విభాగానికి ఒక్కోసారి రోగుల తాకిడి అధికంగా ఉంటుంది. అలాంటి సమయంలో అందరికీ బెడ్స్ కేటాయించాలంటే కష్టమే. తరచూ ఇలాంటి సమస్య వస్తోంది. బెడ్ల సంఖ్య పెంచాలన్న విషయం యాజమాన్యం పరిశీలిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఉస్మానియా, గాంధీలకు రిఫర్ చేస్తున్నాం.