హైదరాబాద్, జూలై 10: అమెరికాకు చెందిన మెడికల్ టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన మెడ్ట్రానిక్.. హైదరాబాద్లో ఏర్పా టు చేసిన మెడ్ట్రానిక్ ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్లోనే గ్లోబల్ ఐటీ సెంటర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ సంయుక్తంగా ప్రారంభించారు. అమెరికా బయట అతిపెద్ద గ్లోబల్ ఐటీ సెంటర్ ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రష్మీ కుమార్ మాట్లాడుతూ..వచ్చే మూడు నుంచి ఐదేండ్లకాలంలో ఈ గ్లోబల్ ఐటీ సెంటర్ను మరింత విస్తరించడానికి రూ.500 కోట్లు(60 మిలియన్ డాలర్లు) పెట్టుబడిగా పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తద్వారా 300 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయన్నా. క్లౌడ్ ఇంజినీరింగ్, డాటా ప్లాట్ఫాం, డిజిటల్ హెల్త్ అప్లికేషన్స్, హైపర్ ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ వంటి విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించడానికి ఈ సెంటర్ను నెలకొల్పినట్లు చెప్పారు.
అంతర్జాతీయ స్థాయిలో క్లయింట్లకు ఇక్కడి నుంచే సేవలు అందిస్తున్నట్లు, మరోవైపు భారత్లో ప్రతిభ కలిగిన ఐటీ ఉద్యోగులు అధికంగా ఉన్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా సంస్థలో 2 వేల మంది సిబ్బంది ఉండగా, వీరిలో అత్యధిక మంది అమెరికాలోనే విధులు నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. హైదరాబాద్ సెంటర్ కోసం మరో 400 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ..తెలంగాణలో తమ పెట్టుబడులను రెండింతలు పెంచుకోవడానికి మెడ్ట్రానిక్ ముందుకురావడం సంతోషంగా ఉన్నదని, కంపెనీకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. భారత్లో అడుగుపెట్టడంలో భాగంగా 2020లోనే హైదరాబాద్లో ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించింది.