అమీన్పూర్, ఏప్రిల్ 12 : అమీన్పూర్ పరిధిలోని ఐలాపూర్‌లో హైడ్రా హల్చల్ రెండో రోజు ఆదివారం కొనసాగింది. ఐలాపూర్, ఐలాపూర్ తాండాల్లో ఉదయం నుంచే హైడ్రా వాహనాల సైరన్ మోగుతూనే ఉంది. ఐలాపూర్‌లోని ప్రధాన రహదారి పక్కనే 208 సర్వేనంబర్‌లో నివాసం ఉంటున్న ఓ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేయించారు. ఏళ్ల కాలం నుంచి ఈ భూమిలో పంటలను సాగు చేసుకున్నామని, 2011 నుంచి ఇండ్లు నిర్మించుకోని నివాసం ఉంటున్నామని బాధితులు తెలుపుతున్నారు.
ఇండ్లు కూల్చేందుకు వచ్చిన అధికారులతో బాధితులు వాగ్వాదానికి దిగారు. తమ వద్ద అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, వీటిని ఎలా కూలుస్తారని అధికారులను బాధితులు ప్రశ్నించారు. జేసీబీ వాహనానికి అడ్డుపడ్డారు. ఆందోళన చేస్తున్న ప్రతి ఒక్కరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ తీరుపై బాధితులు దుమ్మెత్తిపోశారు. ఇవేం పట్టించుకోకుండా అధికారులు భవనాన్ని నేల మట్టం చేశారు. దీంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఐలాపూర్‌లో ముఖీంకు చెందిన ఫాంహౌజ్‌ను పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు. చుట్టూ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని ఆరోపిస్తూ.. హైడ్రా అధికారులు ఆరంతస్తుల భవనాన్ని కూల్చివేయించారు.
తాతల కాలం నుంచి పంటల సాగు
మా తాతల కాలం నుంచి ఈ జాగాలో పంటలను సాగు చేస్తున్నాం. జాగాకు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయి. ఇవేమీ చూడకుండా ఇక్కడ నిర్మించిన ఇంటిని కూల్చివేయడం ఏమిటి. ఉన్న ఇంటిని కూల్చివేస్తే ఎక్కడికి పోవాలే.
– సత్యనారాయణ, మంజుల దంపతులు ఐలాపూర్
అన్ని పన్నులు కట్టించుకున్నారు
పదేళ్లుగా ఇంటికి సబంధించిన పన్నులు చెల్లిస్తూనే ఉన్నాం. కరెంటు బిల్లులు కడుతున్నాం. రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు కూడా ఉన్నాయి. అయినా అధికారులు మా ఇంటిని కూల్చివేశారు. నిరుపేదలకు న్యాయం చేయకపోగా, తీవ్రంగా అన్యాయం చేస్తుంది.
– నగేశ్, బాధితుడు
నిరుపేదలపై కక్ష ఎందుకు ?
నిరుపేదలైన మాపై ప్రభుత్వం ఎందుకు కక్ష కడుతుందో తెలియడం లేదు. మా వద్ద ఇంటికి సంబం ధించిన అన్ని అనుమ తులు ఉన్నాయి. కరెంటు బిల్లులు కూడా ఉన్నాయి. మాకు సమయం కూడా ఇవ్వకుండా భవనాన్ని కూల్చివేయడం ఏమిటి. ప్రభుత్వం అదుకోవాలి.
– లీలావతి, బాధితురాలు