మణికొండ, జనవరి 6 : మణికొండ శివపురికాలనీలో ‘సమాధులనూ వదల్లేదు’ భూ కబ్జాదారుల బరితెగింపు పేరిట ప్రచురితమైన కథనంతో మంగళవారం గండిపేట మండలంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అంతటా ‘నమస్తే’ కథనంపై స్పందిస్తూ అక్రమార్కుల బరితెగింపులపై రెవెన్యూ, పోలీసు అధికారులు ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ స్థానిక ప్రజలు మండిపడ్డారు. ఈ కథనంపై జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తీవ్రస్థాయిలో స్పందిస్తూ అసలు గండిపేట మండలంలో ఏం జరుగుతుందంటూ ఆరా తీశారు. ‘మొన్న కోకాపేట, నేడు మణికొండ ఇలా ఇన్ని అక్రమాలు జరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నారం’టూ ప్రశ్నించినట్లు అధికారులు తెలిపారు.
ఈ వివాదాలస్పదాలపై సమగ్ర విచారణ చేపట్టి అక్రమం అని తేలితే కూల్చివేయాలని, ఇన్నాళ్లు ఇన్ని అక్రమారులు జరుగుతుంటే క్షేత్రస్థాయి అధికారులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారంటూ మండిపడ్డట్లు తెలిసింది. ఈ మేరకు రాజేంద్రనగర్ డివిజనల్ రెవెన్యూ అధికారి వెంకట్‌రెడ్డికి ఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. మణికొండ గ్రామ సర్వే నంబరు 261లో గతంలో కేటాయించిన పట్టాలు ఎన్ని..అక్కడ ఎన్ని నిర్మించారు. అక్రమంగా ఎన్ని నిర్మించారు…ఇప్పటికీ ఖాళీ స్థలం ఎంత ఉంది అనే అంశాలను గుర్తించి నివేదించాలని ఆదేశించినట్లు తెలిపారు. వాటిని గుర్తించి ఎక్కడికక్కడా ప్రభుత్వ బోర్డులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారని ఆర్డీవో వెంకట్‌రెడ్డి వెల్లడించారు.
కొంతమంది వ్యక్తులు కులాల పేరిట అకారణంగా వివక్షపూరితంగా మాట్లాడుతూ విచారణలకు వచ్చిన అధికారులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ అనేక సార్లు క్షేత్రస్థాయి అధికారులు వివరణ ఇచ్చారని, అలాంటి వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు మంగళవారం గండిపేట రెవన్యూ ఇన్స్పెక్టర్ సురేశ్, జీపీ రమాదేవి మణికొండలోని శివపురికాలనీలో సిబ్బందితో కలిసి పర్యటించారు. ‘నమస్తే’ కథనంలో వచ్చిన అంశాలపై క్షుణ్ణంగా పరిశీలన చేపట్టారు.
ఈ సందర్భంగా స్థానికులతో కలిసి కాలనీలో పర్యటించి సర్కారు భూములను గుర్తించారు. కొన్నిచోట్ల నకిలీ పట్టాలతో జరుగుతున్న నిర్మాణాలను గుర్తించి ఆ పనులను నిలిపివేయించారు. ఖాళీ స్థలాలకు సంబంధించిన వివరాలను సేకరించి అన్నిచోట్లా సర్కారు బోర్డులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమగ్ర విచారణ చేపట్టిన తర్వాత అందరికీ నోటీసులు జారీ చేసి పట్టాలపై విచారణ చేపడుతామని రెవెన్యూ ఇన్స్పెక్టర్ సురేశ్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టాలపై పునః సర్వేలు చేపట్టి అనంతరం కూల్చివేతలను చేపడుతామన్నారు. అప్పటి వరకు ఎవ్వరూ ఎక్కడ ఎలాంటి పనులను చేపట్టరాదని నిర్మాణదారులను కోరారు. అతిక్రమించి నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని ఆర్ఐ తెలిపారు.

ఇంటి నంబర్లను రద్దు సిఫారసు
మణికొండ శివపురికాలనీలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టేంత వరకు ఎవరూ ఎలాంటి నిర్మాణాలు జరుపవద్దని గండిపేట తహసీల్దారు శ్రీనివాస్‌రెడ్డి కోరారు. సమాధులను సైతం కూల్చివేసి చేపడుతున్న నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని.. అలా ఎక్కడైనా ఇంటి నంబర్లు కేటాయింపులు జరిగితే రద్దు చేసేందుకు మున్సిపల్ అధికారులకు సిఫారసు చేస్తామన్నారు. చట్టపరిధిలో అక్రమాలు జరిపితే అందరూ బాధ్యులేనని, విచారణ చేపట్టి అక్రమం అని తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.