The Citizen Council | మణికొండ, జూన్ 7 : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ”ది సిటిజన్ కౌన్సిల్” నిరంతరం పాటుపడుతుందని మణికొండ మున్సిపాలిటీ ది సిటిజన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర నాథ్ రెడ్డి అన్నారు. శనివారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని డాలర్ హిల్స్ కాలనీ లోని కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ది సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఉపేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. కొంతమంది తమ కౌన్సిల్ పేరును తప్పుగా సూచించే కుట్ర చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ప్రజల్లో ది సిటిజన్ కౌన్సిల్‌కు పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక కొంతమంది వ్యక్తులు ది సిటిజన్ కౌన్సిల్ పేరును ప్రజల్లో తప్పు భావనను తీసుకొచ్చేలా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ కౌన్సిల్ సభ్యులు ఎక్కడ ఎలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు లేదని, కొన్ని సమాచార మాధ్యమాలలో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలలో తమ కౌన్సిల్ సభ్యులు జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని అందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో సేవ, సంకల్పాన్ని పెట్టుకొని ది సిటిజన్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. కొంతమంది వ్యక్తులు తప్పుడు ప్రచారాన్ని చేయడం సరికాదన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు ఉన్నా ది సిటిజన్ కౌన్సిల్ దృష్టికి తీసుకువస్తే ఖచ్చితంగా వారికి న్యాయం జరిగేలా తనవంతుగా సహకారం అందిస్తామని తెలిపారు.