సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాజకీయంగా చీమ చిటుక్కుమన్నా చటుక్కున మీడియా ముందుకొచ్చే బీజేపీ ఎంపీలు మరోసారి హైదరాబాద్ నగరానికి తీరని అన్యాయం చేశారు. ప్రజలు ఎంతో నమ్మకంతో హైదరాబాద్ మహా నగర పరిధిలోని మూడు లోక్‌సభ స్థానాలను కట్టబెట్టినా… మరో రాజ్యసభ ఎంపీని కలుపుకొని నలుగురు నగరాభివృద్ధికి నిధులు తెస్తారనుకుంటే ఈ ఏడాదీ నిరాశే ఎదురైంది.
తాము మాటల నాయకులం తప్ప చేతల నాయకులం కాదని బీజేపీ ఎంపీలు ఇంకోసారి రుజువు చేశారు. గల్లీలో రాజకీయాలు మాట్లాడటం, అధికార కాంగ్రెస్‌తో కలిసి బీజేపీ మీద ఆరోపణలు చేయడం తప్ప ఢిల్లీ నుంచి నయాపైసా నిధుల్ని తీసుకురావడం తమకు చేతకాదని నిరూపించుకున్నారు. అందుకే ఆదివారం కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్-2026-27లో హైదరాబాద్ నగరాభివృద్ధి నల్లపూసగా మారింది. రూపులేని బుల్లెట్ రైలు కారిడార్ మినహా ఏ ఒక్క రంగంలోనూ నగరానికి నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. దీంతో నిత్యం మీడియా ముందుకొచ్చి రాజకీయ ప్రత్యామ్నాయం మేమేనంటూ బీరాలు పలికే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహా బీజేపీ నలుగురు ఎంపీల వైఫల్యంపై జనం భగ్గుమంటున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలకమైన హైదరాబాద్ మహా నగరాభివృద్ధిపై ఇంకోసారి శీతకన్ను ప్రదర్శించింది. 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు ఏనాడూ.. ఏ ఒక్క ఏడాది కూడా నగరాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వడంగానీ ఏదైనా ఒక ప్రాజెక్టును ప్రకటించడంగానీ చేయని మోదీ ప్రభుత్వం పుష్కర కాలం గడుస్తున్నా కనీసం హైదరాబాద్ మెట్రో మొదటి దశకు వయబుల్ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) కింద ఇవ్వాల్సిన రూ.254 కోట్లను సైతం నేటికీ విడుదల చేయలేదు. చివరకు 2020 సంవత్సరంలో నగరానికి పెద్ద ఎత్తున వరదలు వచ్చి ప్రజలు తీవ్ర నష్టాన్ని చవిచూసినా నయాపైసా ఇచ్చి ఆదుకోలేదు.
ఈ నేపథ్యంలో కనీసం హైదరాబాద్ మహా నగర పరిధిలోని నాలుగు లోక్‌సభ ఎంపీ స్థానాల్లో ఏకంగా మూడు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించినప్పటికీ నగరవాసుల రుణం తీర్చుకోవడానికి బీజేపీ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. మరోవైపు తెలంగాణ అందునా హైదరాబాద్ నగర కోటాలో కేంద్ర మంత్రి హోదాను పొందిన కిషన్రెడ్డిగానీ మరో ఇద్దరు లోక్‌సభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడుగానీ హైదరాబాద్ అభివృద్ధికి రూపాయి నిధులు కూడా తీసుకురాకపోవడంపై జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో నిత్యం మీడియా ముందుకొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడే ఎంపీలు అభివృద్ధి విషయానికొచ్చేసరికి మాత్రం కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం లేదు. అందుకే గత పన్నెండు సంవత్సరాల లెక్కనే మోడీ ప్రభుత్వం 2026-27 కేంద్ర బడ్జెట్లోనూ హైదరాబాద్ నగరాభివృద్ది పెద్ద మొండిచెయ్యి చూపింది.
రక్తికట్టిన గల్లీ-ఢిల్లీ రాజకీయ డ్రామాలు..
నేను కొట్టినట్లు చేస్త… నువ్వు ఏడ్చినట్లు చేయ్ అన్నట్లుంది కాంగ్రెస్-బీజేపీ రాజకీయం. గత రెండు సంవత్సరాలుగా తెలంగాణకు అందునా హైదరాబాద్ నగరాభివృద్ధి నిధుల కోసం ఎక్కిన గడప… దిగిన గడప.. అన్నట్లుగా తండ్లాడుతున్నానంటూ సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రామా చూపారు. బడేబాయ్ అంటూ ప్రధానిని స్తుతిస్తూ పదేపదే వినతిపత్రాలు ఇచ్చారు. దీనికి తోడు నగరాభివృద్ధికి నిధులు సాధించడంలో కలిసి రావాలంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరడం… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే తాను కేంద్రంతో మాట్లాడతానంటూ కిషన్‌రెడ్డి మీడియా ముందు చెప్పడం ఓ ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా గత ఏడాది కాలంగా ఈ రకమైన గల్లీ-ఢిల్లీ రాజకీయాల్ని రక్తి కట్టించి చివరకు బడ్జెట్లో ఇద్దరూ గుండుసున్నా సాధించారు.
హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రాజెక్టు విషయంలో ఒకడుగు ముందుకేసి సీఎం-కేంద్ర మంత్రి మధ్య లేఖలపర్వం కొనసాగింది. దీంతో తాజా బడ్జెట్లో హైదరాబాద్ మెట్రోకు శుభవార్త వస్తుందని అందరూ ఆశించారు. కానీ లేఖలపర్వం అనేది కేవలం రాజకీయ కోణమే తప్ప నిధులు సాధించేందుకు కాదని ఆదివారం బడ్జెట్‌తో తేలిపోయింది. అయితే బడ్జెట్లో హైదరాబాద్‌కు మొండిచెయ్యి చూపడం వెనక. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్ష లేకపోతే నిధులు సాధించడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యం ఈ రెండు తప్ప మరో కారణం ఉండదు. అంటే తెలంగాణ సమాజం ముందు ఈ రెండు పార్టీలే దోషులుగా నిలవాలి. కానీ రేపటి నుంచి రాజకీయం మాత్రం మరో విధంగా ఉంటుందనేది గత అనుభవాల ద్వారా స్పష్టమవుతుంది. రెండు జాతీయ పార్టీలు హైదరాబాద్ అభివృద్ధి అంశాన్ని పక్క దారి పట్టించేందుకు రాజకీయ ఆరోపణలు, విమర్శలను తెరపైకి తెస్తాయి. ప్రధానంగా అందులో రెండు పార్టీలు బీఆర్ఎస్ను లక్ష్యంగా ఎంచుకుని రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటాయే తప్ప హైదరాబాద్ అభివృద్ధి-కేంద్ర నిధులపై మాత్రం నోరు విప్పకుండా జనాన్ని మభ్యపెడుతూనే ఉంటాయి.