బడంగ్‌పేట, జనవరి 20: నిద్రమత్తులో రహదారి డెడ్ ఎండ్ గమనించకుండా అతివేగంగా దూసుకువెళ్లిన కారు నేరుగా రేలింగ్‌ను ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఇన్చార్జి సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ ఫతేదర్వాజకు చెందిన రాజ్‌మహ్మద్ కుమారుడు మహ్మద్ సాజీద్(18) శుక్రవారం అర్ధరాత్రి తన కారులో హసన్ నగర్‌కు చెందిన మహ్మద్ గఫార్ కుమారుడు మహ్మద్ అక్బర్(22), అదే ప్రాంతానికి చెందిన నయామోద్దీన్(21), లంగర్ హౌజ్‌కు చెందిన రాహిల్ భార్య నజీయా బేగం (23), టోలిచౌకి ప్రాంతానికి చెందిన సల్మాన్ ఖాన్ భార్య ముస్కాన్ మెహరాజ్(21)తో కలిసి పాతబస్తీ నుంచి మామిడిపల్లి మీదుగా ఎయిర్ పోర్టు వైపు వెళ్తుతున్నారు.
అర్ధరాత్రి నిద్రమత్తులో రహదారి డెడ్ ఎండ్ గమనించకుండా నేరుగా రేలింగ్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో సాజిద్, అక్బర్, నజియాబేగం అక్కడికక్కడే మృతి చెందారు. నయామోద్దీన్, ముస్కాన్ మెహరాజ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.