ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 26 : తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థులు(Engineering students) గంజాయి తాగుతారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్వీ నాయకులు(BRSV leaders) డిమాండ్ చేశారు. రేవంత్ వ్యాఖ్యలను వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసి, వారిని అవమానించడం తగదని అన్నారు.
తెలంగాణ ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యనభ్యసించిన అనేకమంది ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలకు సీఈవోలుగా ఉన్నారని గుర్తు చేశారు. మరెన్నో రంగాల్లో అగ్రగామిగా సేవలందిస్తున్నారని చెప్పారు. దీనిని రేవంత్రెడ్డి గ్రహించాలని సూచించారు. రేవంత్ క్షమాపణ చెప్పకపోతే ఇంజినీరింగ్ విద్యార్థుల చేతిలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య, నాయకులు నాగేందర్ కోదాటి, అవినాశ్, శ్రీకాంత్, సుష్మ, రియా, అక్షిత, విజయ్, సాయి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.