సిటీబ్యూరో, మే 18(నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లే అవుట్లలో మిగిలిన ప్లాట్ల వేలానికి కసరత్తు మొదలుపెట్టారు. ఒకప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన భూములకు ఇప్పుడు డిమాండ్ లేకుండా పోయింది. ఏడాదిన్నర కాలంగా అన్ని సౌలతులతో డెవలప్ చేసిన ప్లాట్లను విక్రయించలేకపోయారు. దీనికి మార్కెట్లో నెలకొని ఉన్న సందిగ్ధ పరిస్థితులే కారణం కాగా, హైదరాబాద్ కేంద్రంగా ప్రైమ్ ఏరియాల్లో ఉన్న భూములను వేలం వేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రూ. 8500 కోట్ల రెవెన్యూ లక్ష్యంగా హెచ్ఎండీఏ డెవలప్ చేసిన వెంచర్లలో ప్లాట్లను అమ్మనున్నారు.
ఇప్పటికే వేలానికి సంబంధించిన ప్రణాళికలన్నీ పూర్తి కాగా, ముందుగా కోకాపేటలో మిగిలిన 20 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లతో వేలం ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇందుకు కోకాపేట వెంచర్లో డెవలప్మెంట్ పనులు కూడా పూర్తయినట్లు ఇంజినీరింగ్ సిబ్బంది పేర్కొన్నారు. కాగా, హెచ్ఎండీఏ పరిధిలో కొంత కాలంగా పెండింగ్లో ఉన్న భూముల్లో మళ్లీ కదలిక వచ్చింది.
ప్రాజెక్టులు చేపట్టేందుకు హెచ్ఎండీఏ ఇప్పటికే రూ. 20వేల కోట్ల అంచనాలతో ప్రణాళికలు సిద్ధం చేసినా… నిధుల్లేక పనులన్నీ జాప్యం జరుగుతున్నాయి. ఈ క్రమంలో టీజీఐఐసీ వేలానికి వచ్చే స్పందన ఆధారంగా హెచ్ఎండీఏ భూముల వేలంపై కూడా అధికారులు సన్నాహాలు చేయనున్నారు.
కోకాపేటతో వేలం షురూ…
కోకాపేట నియోపోలీస్, ఇతర లే అవుట్ల ద్వారా కోకాపేట భూముల్లో 24 ఎకరాలను హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. బంజారాహిల్స్, బుద్వేల్, వంటి ప్రాంతాల్లోని వెంచర్లను వేలానికి సిద్ధం చేస్తున్నారు. మార్కెట్ దారుణంగా ఉండటంతో గడిచిన ఏడాదిన్నర కాలంగా వేలానికి హెచ్ఎండీఏ ముందుకు రాలేదు. అసలే మార్కెట్లో ఉన్న ప్రతికూలతలను దృష్టిలో పెట్టుకుని, ఆచితూచి అడుగులు వేస్తుండగా… హెచ్ఎండీఏ మరో ప్రయత్నంగా వేలం వేసేందుకు సిద్ధమైంది.