అమీర్‌పేట, ఆగస్టు 2 : పవ్రితమైన గురుగ్రంథ్‌ను ఊరేగింపుగా తీసుకువెళ్లేందుకు ఉపయోగించే అమీర్‌పేట గురుద్వారా ప్రబంధక్ కమిటీకి చెందిన వాహనం (రథ్) కోసం నిర్మించిన షెడ్డును తొలగించేందుకు శనివారం హైడ్రా, మున్సిపల్, పోలీసులు జేసీబీలతో వెళ్లడం ఉద్రిక్తతకు దారి తీసింది. అమీర్‌పేట సత్యం ధియేటర్ చౌరస్తా నుంచి మొదలు కనకదుర్గమ్మ దేవాలయం వరకు పెద్దసంఖ్యలో వ్యాపార సంస్థలున్నాయి.
అయితే ఈ ప్రాంతంలో కొనుగోళ్లు చేసేందుకు వస్తుండే వారి వాహనాల పార్కింగ్ మాత్రం అనుకూలమైన స్థలం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి సత్యం థియేటర్‌కు ఆనుకుని ఉన్న పెద్దనాలాపై విశాలమైన పార్కింగ్ స్థలాన్ని అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నిర్మించి ఇచ్చారు. అయితే ఈ స్థలంలో గురుద్వారా ప్రబంధర్ కమిటీ (అమీర్‌పేట)కు చెందిన వాహనం కోసం ప్రబంధక్ కమిటీ రేకులతో చిన్న షెడ్డును నిర్మించుకున్నది.
అయితే ఈ షెడ్డుపై స్థానికులు కొందరు చేసిన ఫిర్యాదు మేరకు హైడ్రా, పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతకు తరలిరావడంతో ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు సర్దార్ దర్శన్‌సింగ్, ఉపాధ్యక్షుడు లాహోర్ సింగ్, కార్యదర్శి సురిందర్ సింగ్ నేతృత్వంలో పెద్దసంఖ్యలో సిక్కులు అడ్డుకున్నారు. సిక్కుల మనోభావాలను పరిగణంలోకి తీసుకోకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని, ప్రభుత్వం ఇటువంటి చర్యలకు స్వస్తి పలకాలని అధ్యక్షుడు దర్శన్‌సింగ్ అన్నారు. అధికారులు వెనుదిరిగిన తరువాత సిక్కులు పెద్దసంఖ్యలో గూమిగూడి నిరసన తెలిపారు.