ఖైరతాబాద్, డిసెంబర్ 22 : హైదరాబాద్ బుక్ ఫెయిర్ పాత కమిటీపై ప్రస్తుత కమిటీ చేస్తున్న ఆరోపణలన్నీ పచ్చి అబద్దాలేనని పూర్వ కార్యదర్శి కోయ చంద్రమోహన్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సొసైటీ నిబంధనల ప్రకారం ఎన్నికల ముందు అకౌంట్స్ ఆమోదం తప్పనిసరి అని, గత పదేండ్లుగా జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించి, ఆడిటర్ నివేదికలకు ఆమోదం తెలిపిన తర్వాతే ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. వ్యక్తిగత కక్షలతో బుక్ ఫెయిర్‌పై పెత్తనం చెలాయించడమే లక్ష్యంగా దిగజారి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
పూర్వ అధ్యక్షుడు జూలూరీ గౌరీశంకర్, ఇతర కార్యవర్గంపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు యాకుబ్, ఉపాధ్యక్షుడు బాల్ రెడ్డి, కార్యదర్శి వాసు చేస్తున్న ప్రచారం బుక్‌ఫెయిర్ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉందన్నారు. గతంలో పూర్వ కార్యదర్శి శృతికాంత్ భారతిపై దాడి ఘటన నేపథ్యంలో బాల్‌రెడ్డిపై పాత కమిటీ తీసుకున్న చర్యలను మనసులో పెట్టుకొని వ్యక్తిగత కక్షకు పాల్పడుతున్నారని విమర్శించారు. పూర్వ కోశాధికారి పి.రాజేశ్వరరావు మాట్లాడుతూ గతంలో కమిటీలో ఆమోదం పొందిన నిర్ణయాలను అమలు చేశామని, నిబంధనల మేరకు ఎస్బీలో కరెంట్ అకౌంట్ తెరిచామని, జీఎస్టీ చెల్లింపుల కోసం ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా తీసుకున్నామని, ఈ సమాచారాన్నంతా ఆడిట్లో పొందుపర్చామని తెలిపారు.
2018లో కన్వెన్షన్ సెంటర్‌కు చెల్లింపులు చేశారన్న ఆరోపణలు సుద్ధ అబద్దమని, స్టాల్ నిర్మాణం కోసం అన్నపూర్ణ గార్డెన్స్ అనే సంస్థకు చెక్కు ద్వారా చెల్లించినట్టు చెప్పారు. అలాగే 2017-18 ఆర్థిక సంవత్సరంలో జిల్లాల్లో ప్రభుత్వ సహకారంతో నిర్వహించిన పుస్తక ప్రదర్శనల ఆదాయాలు బ్యాంకు అకౌంట్లలో జమ అయినట్లు స్పష్టం చేశారు. వరంగల్, మహబూబ్‌నగర్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల మొత్తాలన్నీ ఆడిట్ రిపోర్టుల్లో ఉన్నాయని చెప్పారు. ఇప్పటికైనా పాత కమిటీపై బురదజల్లే పనులు మానుకోవాలని హితవు పలికారు. ఈ అంశంపై జస్టిస్ చంద్ర కుమార్ వంటి స్వతంత్ర వ్యక్తులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.