భరించలేని వాసన.. రాత్రయితే నిద్రపోలేని పరిస్థితి..వందలాది లారీలతో వెళ్తున్న చెత్తతో విపరీతమైన దుర్గంధం..దోమలు, ఈగలు..రోగాలు..కలుషితమవుతున్న నీరు..జవహర్‌నగర్ డంపింగ్ యార్డుతో నిత్యం ప్రజలు అనుభవిస్తున్న నరకం ఇది. గ్రేటర్‌లోని 8వేల మెట్రిక్ టన్నుల చెత్తతో పాటు నగర శివారులోని 17 మున్సిపాలిటీల నుంచి సేకరించే వ్యర్థాలను జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తుండగా, మొత్తం సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఇక్కడ పోగవుతున్నాయి. నిత్యం 400 వందల లారీలు చెత్తను ఇక్కడికి తరలిస్తున్నాయి. దీంతో సుమారు వంద మీటర్లకుపైగా చెత్త గుట్టలు ఏర్పడుతున్నాయి.
ఈ కారణంగా ఏర్పడుతున్న కాలుష్యంతో పరిసర గ్రామాల వాసులు విలవిలాడిపోతున్నారు. చర్మ, శ్వాసకోశ వ్యాధులతో అవస్థలు పడుతున్నారు. భూగర్భ జలాలు, చెరువులు సైతం ప్రభావం కావడంతో నీళ్లు సైతం తాగలేని దుస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్ల దాటినా.. చెత్త సమస్యను పరిష్కరించడం లేదు.. డంపింగ్ యార్డును తొలగించాలని నిరసనలు తెలుపుతున్నా.. ప్రజల గోసను పట్టించుకోవడం లేదు.
సిటీబ్యూరో/ మేడ్చల్/ జవహర్‌నగర్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్‌లోని 8వేల మెట్రిక్ టన్నుల చెత్తతో పాటు నగర శివారులోని 17 మున్సిపాలిటీల నుంచి సేకరించిన చెత్త ను జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తారు. మొత్తం సు మారు 10 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఇక్కడ పోగవుతున్నాయి. నిత్యం 400 లారీలు జవహర్‌నగర్ డంపింగ్ యార్డు కు చెత్తను తరలిస్తున్నాయి. దీంతో సుమారు వంద మీటర్లకుపైగా చెత్త గుట్టలు ఏర్పడుతున్నాయి.
వేలాది టన్నుల చెత్తను నిర్వహించేందుకు ఒకే శుద్ధి కేంద్రం ఉండటంతో పూర్తిస్థాయి లో రీసైక్లింగ్ కావడం లేదు. శుద్ధి కేంద్రం రోజుకు 2 వేల మెట్రి క్ టన్నుల చెత్తను మాత్రమే శుద్ధి చేయగల సామర్థ్యం ఉంటుం ది. దీని కారణంగా 24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్‌లో 1200 మెట్రిక్ టన్నుల చెత్తను మాత్రమే వి నియోగిస్తున్నారు. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల నుంచి వచ్చే 10 వేల మెట్రిక్ టన్నుల్లో రోజుకు 3,200 మెట్రిక్ టన్నుల చె త్తనే రీసైకిల్ చేస్తున్నారు. దీంతో మిగిలిన వ్యర్థాలు గుట్టలు గు ట్టలుగా ఏర్పడుతున్నాయి. చెత్త గుట్టల నుంచి తీవ్రమైన దుర్గం ధం వెదజల్లుతున్నది. మరోవైపు.. చెత్తను తరలించే లారీలు వందలాదిగా వస్తుండటంతో రోడ్లన్నీ ఛిద్రమవుతున్నాయి. అ టువైపు వెళ్లే ద్విచక్ర వాహనదారులు సైతం దుర్వాసనతో పా టు చెత్త మీదపడుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు.
20 గ్రామాల్లో 5 లక్షల మంది అవస్థలు..
జవహర్‌నగర్ డంపింగ్ యార్డులోని చెత్త గుట్టలు పరిసరాల్లోని 20 గ్రామాల ప్రజలను దుర్గంధంలో ముంచెత్తుతున్నాయి. ఘట్కేసర్, ఉప్పల్, కీసర, కాప్రా మండలాల పరిధిలోని 20 పైగా ప్రాంతాల ప్రజలు డంపింగ్ యార్డు కాలుష్యంతో సతమతమవుతున్నారు. జవహర్‌నగర్, అంబేద్కర్‌నగర్, ప్రగతినగర్, కార్మికనగర్, రాజీవ్‌గాంధీనగర్, గబ్బిలాలపేట, చీర్యాల, మల్కారం, హరిదాస్‌పల్లి, అహ్మద్‌గూడ, తిమ్మాయిపల్లి, బండ్లగూడ, రాజీవ్ స్వగృహ, దమ్మాయిగూడ, నాగారం, రాంపల్లి, యాప్రాల్, బీజేఆర్నగర్, చెన్నాయిపల్లి, శాంతినగర్, బాలాజీనగర్ తదితర గ్రామాలు డంపింగ్ దుర్గంధంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తరలించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మున్సిపల్ అధికారులు, కలెక్టర్, ప్రజాప్రతినిధులకు తరచూ వినతులు సమర్పిస్తున్నారు. భూగర్భ జలాలు సైతం కలుషితమై ఆ ప్రాంతాల్లోని నీళ్లు తాగలేని దుస్థితి నెలకొంది. ఆ ప్రాంతంలోని బోర్ల నీటితో స్నానం చేస్తే చర్మంపై నూనె రాసుకున్నట్లుగా జిడ్డు పేరుకుపోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇండ్లను అమ్ముకుని ఇక్కడి నుంచి వెళ్లిపోదామన్నా ఎవరూ కొనడంలేదని వాపోతున్నారు. ఇక వర్షాకాలం జవహర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో నివసించలేని దుస్థితి ఏర్పడుతున్నది.
డంపింగ్ యార్డు చెత్త నుంచి వచ్చే నీరు నేలలోకి చొచ్చుకునిపోయి దుర్గంధం వెదజల్లుతున్నదని చెబుతున్నారు. ఇంటి పరిసరాల్లోకి మురుగు నీరు చేరి దుర్వాసన భరించలేని పరిస్థితి ఏర్పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే పిల్లలు, వృద్ధుల అవస్థలు చెప్పుకోలేని విధంగా ఉంటాయని ఆందోళన చెందుతున్నారు. ఎక్కడెక్కడి చెత్తనో తీసుకొచ్చి ఇక్కడ పడేస్తూ తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు.
కాలుష్య కాసారాలుగా చెరువులు
జవహర్‌నగర్ పరిసర ప్రాంతాల్లోని చెరువులు కాలుష్య కాసారాలుగా మారిపోతున్నాయి. సమీపంలోని చెరువులు పూర్తిగా కలుషితమయ్యాయి. చెన్నపురం, మల్కాపురం, బాపుఖాన్ (మల్లెలగూడ), ఇందిరమ్మ, ఈదులకుంట, గుండ్లకుంట, ఎర్రకుంట చెరువులు పూర్తిగా పనికిరాకుండా మారాయి. వర్షాకాలంలో డంపింగ్ యార్డులోని చెత్త గుట్టల నుంచి కలుషిత జలాలు వరదలుగా చెరువుల్లోకి చేరుతున్నాయి. వాటిని అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో చెరువుల్లో చేరి పూర్తిగా మురుగు కూపంలా మారుతున్నాయి. ఆ చెరువులు జీవరాశులు సైతం నివసించడానికి వీలులేకుండా మారిపోయాయి. సమీప చెరువులు, వాటి పరిసరాల్లోని భూగర్భ జల వ్యవస్థ పూర్తిగా నాశనమైంది.
జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు సుదూరంగా ఉన్న ఏదులాబాద్ చెరువులోకి కూడా ఈ వ్యర్థ జలాలు చేరుతున్నాయి. ఏదులాబాద్ చెరువులోకి పారిశ్రామిక వ్యర్థాలతో పాటు డంపింగ్ వ్యర్థ జలాలు చేరడంతో గత వర్షాకాలం పది టన్నులకు పైగా చేపలు మృత్యువాత పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూలుస్తూ చెరువుల పరిరక్షణ అని చెప్పుకొంటున్నది. మరి జవహర్‌నగర్ పరిసరాల్లోని చెరువులన్నీ మురికికూపంగా మారుతుంటే కన్నెత్తి కూడా చూడటం లేదు. హైడ్రాకు ఇక్కడి చెరువులు కనిపించడం లేదా? అని పరిసర ప్రాంతాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమకు దర్గంధాన్ని వెదజల్లుతూ భూగర్భ జలాలను కలుషితం చేస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీస్తున్నారు.