22ఏ నిషేధిత జాబితా.. రాష్ట్రవ్యాప్తంగా ఈ పదం వింటేనే సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిషేధిత జాబితా అనేది ఒక భూకంపంలా తయారై ప్రజల్ని అతలాకుతలం చేస్తున్నప్పటికీ అటు ప్రభుత్వం.. ఇటు అధికార యంత్రాంగం సమస్యను పరిష్కరించడం లేదు. పైగా దానిని మరింత జఠిలం చేసే దిశగా అడుగులు వేస్తుండటం అందరినీ మరింత కలవరపాటుకు గురి చేస్తున్నది. ఈ సమస్యకు ఎవరు బాధ్యులు అనేది తేలకపోగా…రెవెన్యూ-రిజిస్ట్రేషన్ శాఖల మధ్య నెలకొన్న సమన్వయలోపం సామాన్యుడి ఆస్తుల్ని మరింత అగాధంలోకి నెట్టివేస్తున్నాయి.
-సిటీబ్యూరో, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ): 22ఏ వివాదానికి పరిష్కారం చూపుతామంటూ మంత్రులు పొంగులేటి, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు పొంతన లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో ఈ అంశాలపై ఇచ్చిన ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తుండటంతో సామాన్యులు చుక్కలు చూస్తున్నారు. “ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కోర్టులకు వెళ్లాల్సిన పనే లేదు. అధికారులకు అప్లికేషన్ ఇస్తే చాలు.. న్యాయబద్ధమైన మీ ఆస్తులకు క్లియరెన్స్ లభిస్తోంది. ప్రజలు ఈ విషయంలో ఆందోళన చెందవద్దు. న్యాయంగా ఉన్నవాటిని త్వరలోనే నిషేధిత జాబితా నుంచి తొలగిస్తాం” అంటూ మంత్రి పొంగులేటి చెప్పిన మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందనే విషయం ఇప్పుడు జనాలకు అర్ధమవుతోంది.
22ఏ నిషేధిత జాబితా పేరిట జనాలను నిండా ముంచిన సర్కారు.. ఇప్పుడు వివాదాస్పదం కావడంతో తేరుకుని, క్షమాపణలు చెప్పి, విధివిధానాల్లేని రీతిలో నిషేధిత జాబితా నుంచి ప్రైవేటు ఆస్తులను తొలగిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇక్కడే సర్కారు తన రెండు నాల్కల ధోరణినీ బయటపెట్టుకున్నది. జాబితాలో చేరిన ఆస్తులను విడిచిపించుకోవడానికి కలెక్టర్లు ఎన్వోసీలు ఇవ్వాలని దిక్కుదివానా లేని విధానాలను తీసుకువచ్చింది. తీరా కాళ్ల వేళ్లా పడి ఎన్వోసీలు తెచ్చుకుని, వాటితో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళితే… ఈ కాగితాలతో రిజిస్ట్రేషన్ చేయమని ఏ చట్టంలో ఉందంటూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది తోక జాడిస్తున్నారు. దీంతో కలెక్టర్లు ఇచ్చే ఈ ఎన్వోసీలు అధికారిక పత్రాలా? లేక చిత్తు కాగితాలా? అంటూ తమ ఆస్తులను కాపాడుకోలేక జనాల గుండెలు గుబేలుమంటున్నాయి.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మీర్‌పేట గ్రామ పరిధిలోని సర్వే నంబరు 33, 34లోని కాలనీ పరిస్థితి నిదర్శనం. వాస్తవానికి ఈ రెండు సర్వే నంబర్లలో 30 ఎకరాల భూమి 1982 సంవత్సరంలో తీగల కేశవరెడ్డి, తీగల రామిరెడ్డి, టీఆర్ఆర్ రెడ్డి, తీగల సుభాష్‌రెడ్డి, తీగల మధుకర్‌రెడ్డి తదితరులకు చెందినదిగా రెవిన్యూ రికార్డుల్లో ఉంది. అయితే వీరి పూర్వీకులు సర్వే నంబరు 34లో పదెకరాల భూమిని భూదాన్ ట్రస్టుకు ఇచ్చారంటూ రికార్డుల్లో పదెకరాలను భూదాన్ భూమిగా పొందుపరిచారు. అనంతరం వీళ్లు తమ పూర్వీకులు ఎలాంటి భూమిని ట్రస్టుకు ఇవ్వలేదంటూ హైకోర్టును ఆశ్రయించి, అందుకు సంబంధించి క్లియరెన్స్ తెచ్చుకున్నట్లు చెబుతున్నారు. ఆతర్వాత 30 ఎకరాల భూమిని పంచాయతీరాజ్ టీచర్స్ హౌసింగ్ సొసైటీకి విక్రయించారు.
ఈ మేరకు పీఆర్టీయూ హౌసింగ్ సొసైటీ వాళ్లు ఒకట్రెండు సంవత్సరాల్లో అందులో లేఅవుట్ చేసి రాష్ట్రవ్యాప్తంగా తమ సొసైటీలో ఉన్న ఉపాధ్యాయులు (సభ్యులు)కు ప్లాట్లు విక్రయించారు. ఆతర్వాత పంచాయతీరాజ్ టీచర్ కాలనీ ఫేజ్-1లోని ఆ ప్లాట్లు చేతులు మారుతూ వస్తున్నాయి. అందులో 95 శాతానికి పైగా ఇండ్లు కూడా నిర్మించుకుని, దశాబ్దాలుగా ప్రజలు జీవిస్తున్నారు. అయితే సర్వేనెంబరు 34లో పదెకరాల భూదాన్ భూమి ఉందంటూ లేఅవుట్ చేసిన పూర్తి 30 ఎకరాలను ఇప్పుడు నిషేధిత జాబితాలో చేర్చారు. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ రెవెన్యూ అధికారులను సంప్రదించగా… కేవలం 34 సర్వే నంబరులోని పదెకరాలు మాత్రమే భూదాన్‌లో ఉందని, ఆ మేరకు సర్వేయర్ ఇచ్చిన స్కెచ్‌ను కూడా రిజిస్ట్రేషన్ శాఖకు పంపినట్లు చెబుతున్నారు.
సర్వేనెంబరు 33లోని పూర్తి భూమితో పాటు 34లోని పదెకరాలు కాకుండా మిగతా భూమి నిషేధిత జాబితాలో లేదని స్పష్టం చేస్తున్నారు. కానీ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మాత్రం ఆ లేఅవుట్లోని రెండు సర్వేనంబర్లు నిషేధిత జాబితాలో ఉన్నట్లు చెబుతుండటంతో జనం గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి దశాబ్దాల కిందట జరిగిన ప్రక్రియను అధికారులు సమగ్రంగా పరిశీలించి… ఎలాగూ సామాన్య ప్రజలు వాటిని కొనుగోలు చేసి నివాసముంటున్నందున ప్రజా కోణంలో సమస్యను పరిష్కరించాలి. నిషేధిత జాబితా నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలి. కానీ అదేమీ చేయకుండా చివరకు భూదాన్ బోర్డుతో సంబంధం లేని భూమిని సైతం 22ఏలో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి జనం అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వందలాది మంది ఈ కాలనీలో బ్యాంకు రుణాలు తీసుకొని ఇండ్లు నిర్మించుకున్నారు. ఈ నేపథ్యంలో వాటిని విక్రయించాలన్నా, కనీసం తాకట్టు పెట్టి బ్యాంకు రుణాలు తెచ్చుకోవాలన్నా వాటిపై నిషేధిత కత్తిని పెట్టడంతో జనానికి ఏమి చేయాల్నో పాలుపోవడం లేదు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన రిజిస్ట్రేషన్ శాఖలోని నిర్లక్ష్యాన్ని, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయలోపాన్ని బయటపెడుతుంది. మొత్తానికి సామాన్యుడి ఆస్తిపై కాంగ్రెస్ సర్కారు హక్కులను రాసుకుందనే విమర్శలు వస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలోని చెంగిచెర్ల సర్వే నెంబర్ 33/10, 33/11 పరిధిలోని 200 గజాల ప్లాటు నిషేధిత జాబితాలో చేరడంతో.. జిల్లా కలెక్టర్ చుట్టూ తిరిగి జూలై 30న ఎన్వోసీ తెచ్చుకున్నారు భూ బాధితురాలు కురుమ జయమ్మ. ఇక ఈ ఎన్వోసీ పత్రంతో తమ ఆస్తికి విముక్తి కలుగుతుందనీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లితే ఆశగా వెళ్లిన ఆమెకు… ఆ శాఖా సిబ్బంది వ్యవహారించిన తీరుతో గుండెలు గుబేలు మనే స్థితికి వచ్చింది.
శనివారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు బాధితులు కార్యాలయంలోనే నిరీక్షించిన, తీవ్ర మానసిక వేదనతో వెనుతిరిగాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చోటుచేసుకుంటున్న అటూ రెవెన్యూ యంత్రాంగం.. ఇటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది కానీ స్పందించడం లేదు. కనీసం సమస్యకు పరిష్కారం చూపకుండా… మరింత జఠిలం చేస్తూ జనాల ఆస్తులను కాజేసే కుట్రలు చేస్తుందనే ఆరోపణలకు బలం చేకూరేలా సర్కారు వ్యవహారం ఉంది.
కలెక్టర్లు ఇచ్చే ఎన్వోసీల విషయంలో చాలా వివాదాలు ఉన్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ చేయాలని సబ్ రిజిస్ట్రార్ చట్టంలోనే లేదు. నిబంధనలు వేరుగా ఉన్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తులను బదిలీ చేయడానికి రెవెన్యూ శాఖ రూపొందించిన ప్రొహిబిటేడ్ జాబితా నుంచి సంబంధిత ఆస్తులను తొలగిస్తే గానీ చేయలేం. చట్టం ప్రకారమే ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాగుతోంది. కలెక్టర్ నుంచి తీసుకువచ్చిన ఎన్వోసీలతో ఎక్కడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడవడం లేదు. ఈ విషయంలో వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు గానీ, ఆధారాలు గానీ లేవు.
– అశోక్, డీఆర్ మేడ్చల్ జిల్లా
జనాల ఆస్తులకు రక్షణ లేకుండా చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికు ఈ విషయంలో ఏమాత్రం అవగాహన లేనివారిగా నిలిచిపోతున్నారు. ఏమాత్రం అవగాహన ఉన్నా… చట్టంలోని నిబంధనల ప్రకారం నిషేధిత జాబితా సమస్యకు పరిష్కారం చూపాలి. కానీ ఎన్వోసీలు కలెక్టర్లు జారీ చేయాలని ఆదేశించి… జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ విషయంలో ఎన్వోసీ ఆధారంగా జరిగిన లావాదేవీలు, వాటిని నిర్వహించిన సబ్ రిజిస్ట్రార్ సిబ్బందిని, ఎన్వోసీలు ఇచ్చిన కలెక్టర్లను సస్పెండ్ చేయాలి. లేదంటే ప్రభుత్వ ఆదేశాలను అనుసరించకుండా, జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్న అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి తమ పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజా సమస్యలపై అవగాహన లేని వ్యక్తులు, వారు మాట్లాడే అవగాహనలేని ముచ్చట్లతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. అందుకే 22ఏ పేరిట జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించనీ సర్కారు విఫలమైనట్లుగా భావించాలి.
– నారగోని ప్రవీణ్ కుమార్, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్