ఇది బేగంపేటలోని కట్టమైసమ్మ దేవాలయం వెనక, ధనియాలగుట్టలో ఉన్న నాలాల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలు. కూకట్పల్లి, అమీర్‌పేట నుంచి వచ్చే నాలా బేగంపేట కట్టమైసమ్మ దేవాలయం వెనక కలుస్తుంది. ఇక్కడి నుంచి బ్రాహ్మణవాడి మీదుగా ప్రవహించి హుస్సేన్‌సాగర్ నాలాలో చేరుతుంది. ప్రస్తుతం ఈ నాలాల్లో చెత్త, పూడిక పేరుకుపోవడంతో దుర్గంధం వ్యాపించింది. ఇక… చినుకుపడితే వరద వెళ్లే మార్గం లేక నాలాను అనుసరించి ఉన్న బస్తీలు, కాలనీలన్నీ జలదిగ్భంధం అయ్యే ప్రమాదమున్నది. అయితే ఇప్పటికైతే 60 శాతం పనులు పూర్తి చేశామని ఈఈ సుదర్శన్ చెబుతున్నారు. పనులు పూర్తి కాకపోవడంతో వర్షాలు పడితే తమ పరిస్థితి ఏమిటని జనం బిక్కుబిక్కుమంటున్నారు.
ఇది యూసుఫ్‌గూడలోని నాలా. వరద నీటిని మోసుకుపోవాల్సిన ఈ నాలా పూర్తిగా చెత్త, పూడికతో నిండిపోయింది. నాలాలో నీరు సాఫీగా పోయేందుకు చేపట్టాల్సిన పనులు కాంట్రాక్టర్ల సమ్మెతో జరగలేదు. కొన్నిరోజుల కిందట జీహెచ్ఎంసీ ఈఈ రాజ్‌కుమార్, డిప్యూటీ ఈఈ రామచంద్రరాజు నాలాను పరిశీలించారు. కానీ ఇప్పటికీ ఆ నాలా దుస్థితి ఇలా ఉన్నది. ఒకవేళ చిన్నపాటి వర్షం పడినా.. నాలాలో వరద ప్రవాహానికి దారి లేదు. ఈ క్రమంలో వరద నివాస గృహాలను ముంచెత్తే ప్రమాదం లేకపోలేదు.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 30 (నమస్తే తెలంగాణ)/జూబ్లీహిల్స్, బేగంపేట: ఎక్కడికక్కడ నాలాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు..పడకేసిన ‘ఎస్ఎన్డీపీ’ పనులు..వెరసి.. నగర పరిధిలోనే కాదు.. శివారులోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని లోతట్టు ప్రాంతాలకు వర్షాకాలంలో వరద ముప్పు పొంచి ఉన్నది. ప్రభుత్వాలు మారినా… ప్రజల మౌలిక వసతులు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి సంబంధించిన పనులు మాత్రం ఆగొద్దు. సీజన్ల వారీగా జరగాల్సిన పనులు పూర్తయితేనే జనం ఇబ్బందులు తొలిగిపోతాయి.
అయితే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ముందుచూపుతో చేపట్టిన వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ)తో ప్రతి ఏటా చేపట్టే నాలాల పూడికతీత పనులు నాలుగైదు నెలలుగా పడకేశాయి. నిధులు లేవంటూ.. జీహెచ్ఎంసీ అధికారులు పనులపై శీతకన్ను ప్రదర్శిస్తున్నారు. కాంట్రాక్టర్ల సమ్మెతో పరిస్థితిని మరింత దిగజార్చింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన దరిమిలా.. మరో వారం రోజుల్లోనే వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణ వర్షం పడితేనే నాలాల్లో వరద ముందుకుపోయే పరిస్థితి లేదు. అదే భారీ వర్షం పడితే మాత్రం బస్తీలు, కాలనీలకు వరద ముప్పు పొంచి ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
చినుకుపడితేనే నగరం వణుకుతున్నది. రోడ్లన్నీ చెరువులను తలపించడం సాధారణంగా మారుతున్నది. ట్రాఫిక్ జామ్‌లతో వాహనదారులు నరకం చూస్తున్నారు. అందుకే వర్షాకాలానికి ముందే అధికార యంత్రాంగం కచ్చితంగా కొన్ని పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా విద్యుత్ వైర్లకు అడ్డుగా, అల్లుకుపోయిన చెట్ల కొమ్మలను తొలగించడం ఒకటైతే… నాలాల్లో పూడికను తీసివేసి, వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు పనులనూ గాలికొదిలేసింది. ఏ ఒక్కనాడూ ప్రభుత్వ, అధికార యంత్రాంగం వీటిపై దృష్టిసారించలేదు. విద్యుత్ శాఖలో ఎల్సీలను రద్దు చేయడంతో చెట్ల కొమ్మలను కొట్టే పనులను చేపట్టలేదు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో ఆ పనులను చేపడుతుండగా, చాలా చోట్ల పూర్తి కాలేదు. ఏటా వేసవిలోనే కొమ్మల తొలగింపు పనులను పూర్తి చేయడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాదిలో ఆ ప్రక్రియను సరిగ్గా చేపట్టకపోవడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
కొన్ని నెలలుగా నగరంలో జీహెచ్ఎంసీ అభివృద్ధి, నిర్వహణ పనులు గాడి తప్పాయి. ఒకవైపు ప్రజల మౌలిక వసతులకు సంబంధించిన ఎస్ఆర్డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం)తో పాటు ఎస్ఐజీ (స్పెషల్ ఇన్ఫ్రా గ్రాంట్) కింద చేపట్టాల్సిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిలిపివేశారు. కొన్నిరోజుల కిందట జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఎస్ఐజీ కింద రూపొందించిన 754 పనులను పూర్తిగా రద్దు చేశారు. మరోవైపు నాలాల్లో పూడిక తీత పనులపైనా నిర్లక్ష్యం వహించారు. కొన్ని ప్రాంతాల్లో కొంత మేర పనులు జరుగుతున్నా… సమయం మించి పోవడంతో నగరంలో ఎక్కడ చూసినా నాలాల్లో చెత్త, పూడిక పేరుకుపోయాయి. దీంతో చిన్నపాటి వర్షం నీరు కూడా పోయే మార్గాలు మూసుకుపోయాయి. ఆ వరద వెనక్కి వచ్చి.. నివాసాలను ముంచెత్తే ప్రమాదం పొంచి ఉందని అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంత ప్రజలు భయపడుతున్నారు.
గ్రేటర్లో నాలా అభివృద్ధి పనులు గడిచిన ఐదు నెలలుగా నత్తనడకన సాగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రధానమైన హుస్సేన్‌సాగర్ వరద నీటి నాలా, బల్కాపూర్ నాలా పనులతో పాటు శివారు మున్సిపాలిటీల్లో చేపట్టిన పనులు మధ్యనే నిలిచిపోయాయి. చేసిన పనులకు జీహెచ్ఎంసీ బిల్లులు చెల్లించడం లేదని , పెండింగ్ బిల్లులు ఇస్తేనే పనులు చేపడతామంటూ కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వరద నీటికి శాశ్వత చర్యలు చేపట్టాలని భావించి..ఎస్ఎన్డీపీ తొలి విడత పథకం ద్వారా రూ. 985.45కోట్లతో 58 చోట్ల నాలా అభివృద్ధి పనులను చేపట్టింది.
పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూ.531 కోట్లతో 35 ప్రాంతాల్లో వేలాది కాలనీల వరద ముంపు సమస్యకు పరిష్కారం చూపింది. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎన్డీపీ పనుల పురోగతిపై సమీక్షించిన దాఖలాలు లేవు. ఖజానాలో డబ్బుల్లేక కాంట్రాక్టర్లకు చెల్లింపులను నిలిపివేశారు. చాలా చోట్ల గోడలు, స్లాబుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఫలితంగా రూ.394.65 కోట్లతో 20 చోట్ల జరుగుతున్న పనులపై తీవ్ర ప్రభావం పడింది. ఎస్ఎన్డీపీ పనులు పూర్తి కాకపోవడంతో సరూర్‌నగర్, నాగోల్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, చార్మినార్, చాంద్రాయణగుట్ట హయత్‌నగర్, వనస్థలిపురం, హబ్సిగూడ, ఉప్పల్ రామంతాపూర్‌తో పాటు శివారు ప్రాంతాలైన బడంగ్‌పేట, జల్పల్లి, పెద్ద అంబర్‌పేట, మీర్‌పేట ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.