చిక్కడపల్లి, మే 5: ఆర్టీసీ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అమలు చేయకపోవడంతో 7 నుంచి సమ్మె నిర్వహిస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పేర్కొన్నారు. సోమవారం ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు కార్మిక కవాతు నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి, యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, కో చైర్మన్ కె. హనుమంతు ముదిరాజ్, వైస్ చైర్మన్ ఎం. థామస్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 18 నెలలు దాటుతున్నా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేదని, సమస్యలను పరిష్కరించలేదని మండిపడ్డారు. ‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా.. ఇప్పటివరకు ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడానికి గత సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దానిని ముందుకు తీసుకెళ్లడం లేదు’. అని ఆర్టీసీ ఉద్యోగులు భూమయ్య, నాగరాజ్ అన్నారు.