Telugu | ఖైరతాబాద్, మార్చి 2 : దేశాన్ని సైనికులు కాపాడినట్లుగానే.. తెలుగు భాషను భాషాభిమానులు కాపాడుకోవాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి రజిని అన్నారు. లక్డీకపూల్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ కాలేజీలో యువ భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, కిన్నెర ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ‘తెలుగు వెలుగు’ పేరుతో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ప్రముఖ సాహితీవేత్త ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ.. గతంలో ఆలిండియా రేడియోలో జాబులు, జవాబులు, పద్యాలతో రణం, కన్యాశుల్కం, ఆధునిక మహాభారతం, శ్రవ్యవాటిక తదితర అనేక కార్యక్రమాలను ప్రసారం చేస్తూ తెలుగు భాషను ప్రచారం చేసిందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ వంగపల్లి విశ్వనాథం, కిన్నెర ఆర్ట్స్ సంస్థ కార్యదర్శి ఎం. రఘురాం, ఇరుకంటి వెంకటేశ్వర శర్మ, డాక్టర్ ఉప్పలపాటి కుసుమ కుమారి, డాక్టర్ ఫణింద్ర, ఐఐఎంసీ కళాశాల ప్రిన్సిపాల్ కూర రఘువీర్, యువభారతి కార్యదర్శి వెంకటరావు, రవీంద్ర, అశ్వినికుమార్ తదితరులు పాల్గొన్నారు.