అప్పుల కుప్పలో కూరుకుపోయిన బల్దియాకు సర్కారు ఝలక్ ఇచ్చింది.. ‘సీఆర్ఎంపీ’ పనులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. ‘జీహెచ్ఎంసీకి వచ్చే ఆదాయం నుంచే ఈ పనులను పూర్తి చేసుకోవాలి..సర్కారు సాయం ఆశించొద్దు’ అంటూ ఉచిత సలహా ఇచ్చింది. దీంతో ములిగే నక్కపై తాటిపండు పడిందన్న చందంగా తయారైంది జీహెచ్ఎంసీ పరిస్థితి. ఆస్తి పన్ను ద్వారా వచ్చే ఆదాయంలో అధిక భాగం పాత బకాయిలు, జీతాలకే సరిపోతుండగా, కొత్తగా వేల కోట్ల రూపాయలను రహదారుల కోసం ఎక్కడి నుంచి తేవాలని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఈ సలహా రావడం వారిని తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించకుండా, సంస్థపైనే భారాన్ని నెట్టేయడం ఏమిటని చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయకపోతే, ప్రతిపాదించిన 1,142 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి పనులు కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉందంటున్నారు. సీఆర్ఎంపీ రోడ్ల నిర్వహణ ఆగితే.. నగరంలో ప్రయాణం నరకప్రాయమవుతుందని చెబుతున్నారు.
సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ ): కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రాం(సీఆర్ఎంపీ) పథకం రివర్స్ గేర్‌లోకి మళ్లింది. గడిచిన ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలకు మోక్షం దక్కుతుందని భావించిన జీహెచ్ఎంసీకి.. సీఆర్ఎంపీ మొదటి, రెండో దశ పనులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే అప్పుల భారంతో కునారిల్లుతున్న సంస్థకు రోడ్ల నిర్వహణ కోసం నిధులు ఎక్కడి నుంచి తేవాలని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. అప్పుల కుప్పలో జీహెచ్ఎంసీ..ఇప్పటికే వివిధ బ్యాంకుల నుంచి తెచ్చిన దాదాపు రూ. 6,000 కోట్ల రుణాలకు వడ్డీలు చెల్లించడానికే ముప్పతిప్పలుపడుతున్నది. సర్కారు నుంచి ఈ సలహా రావడంతో విస్మయానికి గురైంది.
నీరుగారిన ఆదర్శ పథకం
బీఆర్ఎస్ హయాంలో అందుబాటులోకి వచ్చిన మొదటి దశ సీఆర్ఎంపీ పథకం రోడ్ల నిర్వహణలో ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ తదితర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. గుంతలు లేని రహదారులే లక్ష్యంగా వాహనదారులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రధాన రహదారుల నిర్వహణలో భాగంగా 510 విభాగాలుగా విభజించి.. తొలి విడతగా 744 కిలోమీటర్ల రహదారిని ప్రైవేట్ ఏజెన్సీలకు 2020లో నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దాదాపు రూ.1900కోట్ల మేర ఖర్చు చేసి నిర్ణీత లక్ష్యాన్ని గతేడాది అక్టోబరులోనే చేరుకున్నారు. ఈ సీఅర్ఎంపీ విధానం ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలిచింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే సీఆర్ఎంపీ మోడల్ వివరాలను తీసుకోగా, ఛత్తీస్‌గఢ్ , రాజస్థాన్‌కు చెందిన పలు కార్పొరేషన్లు పురపాలక శాఖను సంప్రదించారు.
ఇటువంటి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రెండో దశ ప్రతిపాదనలను పక్కన పెట్టడం, కనీసం మొదటి దశ నిర్వహణను సమర్థవంతంగా చేపట్టకపోవడం గమనార్హం. కాగా, సీఆర్ఎంపీ మొదటి దశలో భాగంగా రోడ్ల నిర్వహణ బాధ్యతలు గత ఏడాది జనవరి నెలలో ఏజెన్సీల నిర్ణీత గడువు ముగిసింది. దీంతో ఫుట్‌పాత్‌ల నిర్వహణ, సెంట్రల్ మీడియన్, కెర్భ్ పెయింటింగ్, లేన్ మార్కింగ్, స్వీపింగ్, గ్రీనరీ నిర్వహణ జీహెచ్ఎంసీ చేపడుతూ వస్తున్నది. మొదటి దశతో పాటు రెండో దశ కలిపి రూ. 3825 కోట్ల రోడ్ల నిర్వహణ పనులకు పరిపాలన అనుమతి ఇవ్వాలని ప్రతిపాదనలు అందజేయగా, ఇంతకాలం కాలయాపన చేసి నిధులు లేవని, సొంత నిధులతో నిర్వహించుకోవాలని జీహెచ్ఎంసీకి సూచించడం గమనార్హం.