శివార్లలో ఉండాల్సిన టెక్స్టైల్ డైయింగ్ సెంటర్లు నగరం నడిబొడ్డున వెలిశాయి. ఏండ్ల తరబడిగా వాటిని నడుపుతూ ప్రమాదకరమైన రసాయనాలు కలిపిన రంగులను బహిరంగంగా నాలాల్లోకివదులుతున్నారు. దుస్తులకు అద్దకాలుగా వినియోగిస్తున్న రంగుల వ్యర్థాలను దుకాణాల్లోనే డ్రైనేజీ పైపుల ద్వారా నాలల్లోకి పంపిస్తున్నారు. ఇదంతా నిత్యం రద్దీగా ఉండే బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 10లో జరగుతుంది.
సిటీ బ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): బసవతారకం క్యాన్సర్ దవాఖాన పక్కన ఉన్న నూర్‌నగర్‌లో పదుల సంఖ్యలో టెక్స్టైల్ డైయింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఖరీదైన దుస్తులను విక్రయించే మ్యాచింగ్ సెంటర్లు, వస్త్ర దుకాణాలు, టైలరింగ్ మగ్గం వర్క్ చేసే దుకాణాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. వీటిలో కొనుగోలు చేసిన వస్ర్తాలకు కలర్ డైయింగ్ చేసే సెంటర్లను కూడా అనుబంధంగా నిర్వహిస్తున్నారు.
ప్రజలు వస్త్ర దుకాణాల్లో తీసుకున్న దుస్తులకు మ్యాచింగ్ రంగుల కోసం డైయింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. రోజుకు వందల్లో వస్ర్తాలకు రంగులు అద్దుతూ వ్యర్థాలను దుకాణాల్లోనే డ్రైనేజీలోకి వదులుతున్నారు. దీంతో నాలాలో కలిసిపోయి తాజ్ బంజారా చెరువులోకి చేరుతున్నాయి. మరోవైపు రోడ్ నంబర్ 10, రోడ్ నంబర్ 13తో పాటు సింగాడకుంట, నూర్ నగర్ ప్రాంతాల్లో రంగులు భూగర్భంలోకి చేరుతున్నాయి. ఈ తతంగమంతా ఏండ్ల తరబడిగా జరుగుతున్నా జీహెచ్ఎంసీ, జలమండలి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు.
ప్రమాదకర రసాయనాలతో..
టెక్స్టైల్ డైయింగ్ సెంటర్ల నుంచి వెలువడే రంగుల్లో ఎసిటిక్ ఆమ్లం, సోడియం కార్పొనేట్, సోడియం హైడ్రో సల్ఫేట్ రసాయనాలు ఉంటాయి. ఇవి డ్రైనేజీ నుంచి ఓపెన్ నాలాల్లోకి చేరుతుండంతో ఆ పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముక్కు పుటాలదిరే గాఢమైన వాసన రావడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం శ్వాస సంబంధ వ్యాధుల బారిన పడుతున్నామని వాపోతున్నారు. సోడియం హైడ్రో సల్ఫేట్ గాలిలోకి సలర్ఫ్ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తుంది.
దీన్ని పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు, తీవ్రమైన దగ్గును కలిగిస్తుంది. దీని తీవ్రత పెరిగినప్పుడు పల్మినరీ ఎడిమా అనే వ్యాధికి గురై మరణం సంభవిస్తుంది. అటు ఎసిటిక్ ఆమ్లం గొంతు, ముక్కు, ఊపిరితిత్తుల సమస్యలకు దారి తీస్తుంది. తీవ్రమైన దగ్గుతో ఛాతీ భాగం బిగుతుగా మారుతుంది. ఎసిటిక్ ఆమ్లాన్ని ఎక్కువ రోజులు పీల్చడం వల్ల వాయునాళం దెబ్బతింటుంది. హృదయ స్పందనల వేగం పెరిగి కొన్నిసార్లు గుండెపోటుకు దారి తీస్తుంది.
ఎసిటిక్ ఆమ్ల ప్రభావం వల్ల ఊపిరితిత్తుల్లో ద్రవం పేరుకుపోతుంది. ఈ రసాయనాలను ఎక్కువగా పీల్చడం వల్ల ప్రాణాంతక క్యాన్సర్ల భారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెక్స్టైల్ డైయింగ్ కేంద్రాల నుంచి ఇష్టానుసారం రంగుల వ్యర్థాలను వదలడం వల్ల రోడ్ నంబర్ 10, 13 పరిధి సింగాడ కుంట, నూర్ నగర్, కృష్ణ పురం ప్రాంత ప్రజలపై ప్రభావం పడుతున్నది. ఈ వ్యర్థాలన్నీ తాజ్ బంజారా చెరువుల్లో చేరుతుండటంతో పరిసర ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నామని చెబుతున్నారు. ఏండ్ల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాలాలో రంగు నీరు
సింగాడకుంట నుంచి తాజ్ బంజారా చెరువులోకి ప్రవహిస్తున్న నాలాలో ఏండ్ల తరబడిగా రంగు నీరు ప్రవహిస్తున్నది. ఈ నీళ్లు గాఢమైన వాసనను వెదజల్లుతున్నాయి. దీంతో చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నాం. ఏండ్ల తరబడిగా మా బాధను ఎవరూ పట్టించుకోవడం లేదు. – సింగాడకుంట వాసి
మొద్ద నిద్రలో యంత్రాంగం
నగరం నడిబొడ్డున టెక్స్టైల్ డైయింగ్ సెంటర్లు నిర్వహిస్తూ.. ప్రమాదకర రసాయనాలతో కూడిన రంగులను నాలాల్లోకి వదులుతున్నా జీహెచ్ఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని బంజారాహిల్స్ ప్రజలు ఆరోపిస్తున్నారు. భూగర్భ, జల, వాయు కాలుష్యానికి పాల్పడుతున్నా కాలుష్య నియంత్రణ మండలి కనీస తనిఖీలు చేపట్టడం లేదని మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాలుష్య నియంత్రణ మండలి మొద్దు నిద్ర వహిస్తున్నదని అంటున్నారు. ప్రమాదకర రసాయనాలతో వ్యాధుల బారిన పడుతున్నా నిర్వాహకులపై కనీస చర్యలు తీసుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.
నగరంలోని నాలాల్లోని నీటిని పీసీబీ అధికారులు పరీక్షలు చేయడం పూర్తిగా మానేశారని మండిపడుతున్నారు. నాలాల్లో నెలల తరబడి బహిరంగంగా రంగు నీళ్లు ప్రవహిస్తున్నా.. పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో తాము దీర్ఘకాలంగా వ్యాధుల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలాల్లోకి రంగు నీటిని విడుదల చేస్తున్నా జీహెచ్ఎంసీ చోద్యం చూస్తున్నదని అంటున్నారు. తాజ్ బంజారా చెరువు కాలుష్య కాసారంగా మారుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.