చేనేత, హస్తకళలకు చెందిన వృత్తిదారులను ప్రోత్సహించే ఉద్దేశంతో గో స్వదేశీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వస్త్ర, హస్తకళ ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. బంజారాహిల్స్ కళింగ కల్చరల్ హాల్లో ఈనెల 4న ప్రారంభమైన ఈ ప్రదర్శన 8వ తేదీన ముగిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒడిస్సా, రాజస్తాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, కశ్మీర్, మధ్యప్రదేశ్, నార్త్ ఈస్ట్ రాష్ర్టాలకు చెందిన చేతి వృత్తుల వారు తయారు చేసిన చేనేత చీరెలు, ఇతర ఉత్పత్తులు ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శనలో ఉంచారు. అందమైన డిజైన్లతోపాటు ఆకర్షణీయమైన క్లాసిక్, ఉప్పాడ, గద్వాల్, ఒడిస్సా ఐకాట్స్, ఇక్కత్, జామ్ దానిస్, తంగైల్, మహేశ్వరీస్, చందేరీస్, పట్టు, బనారస్, సిల్క్ కాటన్ చీరెలు, హ్యాండ్లూమ్స్, ఎంబ్రాయిడరీ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ డ్రెస్‌లు ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాలకు చెందిన ప్రత్యేక ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపారు.
చేనేత, హస్తకళలకు చెందిన వృత్తిదారులకు అండగా నిలిచి.. వారి వృత్తిని సమర్థవంతంగా నిర్వహించేలా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే గో స్వదేశీ, కో ఆప్ సంస్థ విరివిగా ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తున్నది. ఈనెల 7న చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాం. గో స్వదేశీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లోనూ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి చేనేత కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటు కల్పిస్తున్నాం. – మాధవి నాయుడు, గో కో-ఆప్ సేల్స్, మార్కెటింగ్ జీఎం.
ఇటీవల దేశాన్ని కరోనా కుదిపేసింది. చేనేత రంగాన్ని కూడా కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ప్రదర్శన ద్వారా చేనేత వృత్తిపై ఆధారపడిన మాలాంటి వాళ్లకు కొంత ఆర్థిక వనరు కలుగుతుంది. ఆయా సంస్థలతోపాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలకు చెందిన ప్రభుత్వాలు సైతం చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్నాయి. – రమాకాంత్, ఒడిస్సా
మా ఉత్పత్తులను ఒకే చోట విక్రయించడం వల్ల ప్రయోజనం ఉండదు. అక్కడక్కడ ఎగ్జిబిషన్లలో పాల్గొంటున్న కారణంగా వివిధ రాష్ర్టాలకు చెందిన వారితో పరిచయాలు ఏర్పడి మేం తయారు చేసే ఆర్టిజమ్ చీరెలు విస్తృతంగా విక్రయించే అవకాశం కలుగుతుంది. – రాహుల్‌కుమార్, జైపూర్
పట చిత్రాలు తయారుచేసే హస్త కళాకారులు దేశంలో తక్కువగా ఉంటారు. ఈ అరుదైన చిత్ర కళను ఇటువంటి ప్రదర్శనల ద్వారా ప్రజలకు చేరువ చేసే అవకాశం దక్కుతున్నది. గో స్వదేశీ సంస్థ వారి ఎగ్జిబిషన్లో పాల్గొనేందుకు ఆహ్వానం పలుకడం ఆనందంగా ఉంది. – జితేంద్ర సాహూ, ఒడిస్సా.
దేశవ్యాప్తంగా గద్వాల్ పట్టు చీరెలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. మా ప్రాంతంలో చేనేత కుటుంబాలకు చెందిన చాలా మంది చీరెలు నేయడంపైనే ఆధారపడి బతుకుతున్నారు. చేనేత వృత్తిదారులకు ప్రభుత్వం కూడా తగిన ప్రోత్సాహం అందిస్తున్నది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన వస్త్ర, హస్తకళా ప్రదర్శనల్లో పాల్గొనడం వల్ల మా విక్రయాలను విస్తరించేందుకు తగిన అవకాశం ఏర్పడుతుంది. – రమేశ్, గొర్లఖాన్‌దొడ్డి, గద్వాల్