Miyapur | హైదరాబాద్ : మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
మియాపూర్‌లోని జనప్రియ అపార్ట్‌మెంట్స్‌లో కే హన్సిక(14) అనే విద్యార్థిని తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. హన్సిక స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. గురువారం సాయంత్రం తాను నివాసముంటున్న భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకింది హన్సిక. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
రక్తపు మడుగులో పడి ఉన్న హన్సికను చూసి సెక్యూరిటీ గార్డ్ షాక్ అయ్యాడు. వెంటనే ఆమె కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు హన్సిక డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అయితే ఘటనాస్థలిలోని కానీ, ఇంట్లో కానీ ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దృష్టి సారించారు. కుటుంబ సభ్యులతో పాటు ఆమె స్నేహితులను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. హన్సిక ఆత్మహత్యకు కుటుంబ సమస్యలా..? లేక ప్రేమ వ్యవహారమా..? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.