Miyapur | మియాపూర్ దీప్తిశ్రీనగర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకున్నది. హెచ్ఎండీఏ భూమిలో వేలాది మంది గుడిసెలు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు పోలీసుల సహాయం వాటిని తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శేరిలింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101లో సుమారు 504 ఎకరాల్లో హెచ్ఎండీఏ భూమి ఉన్నది. ఇందులో గుడిసెలు వేసుకొని మూడు నాలుగు రోజులుగా అక్కడే ఉంటున్నారు. అయితే, ప్రభుత్వం ఇక్కడ ఇండ్ల స్థలాలు ఇస్తుందని స్థానికంగా ప్రచారం జరిగింది. దీంతో ఇక్కడి పలు ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివచారు. దాదాపు 2వేల మంది వరకు గుడిసెలు వేసుకున్నారు. వాటిని తొలగించేందుకు అధికారులు యత్నించారు.
భూముల నుంచి ఎట్టిపరిస్థితుల్లో బయటకు వెళ్లేది లేదని జనం భీష్మించారు. గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్నవారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్ఎండీఏ అధికారులు హెచ్చరించారు. గుడిసెలు ఖాళీచేయకపోతే పీడీయాక్ట్ కేసులు పెడతామన్నారు. పోలీసులు. సామాన్యులను రెచ్చగొట్టి ప్రభుత్వభూములను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు పోలీసులు. పేదలు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో కదిలేది లేదంటున్నారు. దీంతో మియాపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గతంలో ఇది ప్రభుత్వ భూమని తెలియక 16మంది వ్యక్తులు కొన్నారని పోలీసులు తెలిపారు. భూమి ప్రభుత్వానిదని కోర్టు నిర్ధారించి.. హెచ్ఎండీఏకు అప్పగించిందన్నారు. కొందరు కొన్నవారు సుప్రీం కోర్టును ఆశ్రయించారని.. మరికొందరు సామాన్య ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్నారని అధికారులు ఆరోపించారు.