సిటీబ్యూరో, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ) : డబుల్ బెడ్రూం ఇండ్లలో మౌలిక వసతుల కల్పనపై జీహెచ్ఎంసీ అధికారుల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. నిధుల లేమితో ఇంతకాలంగా సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టలేదు. దాదాపు రూ. 200 కోట్ల మేర నిధులను జలమండలికి కేటాయించాల్సి ఉన్నప్పటికీ మంజూరు చేయలేదు. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారులంతా కొన్ని నెలలుగా భారీ ఎత్తున ఇందిరాపార్కు, జలమండలి, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
ఇటీవల జరిగిన ప్రజావాణిలో మేయర్, కమిషనర్‌ను ఘోరావ్ చేసి.. మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు హామీ ఇచ్చిన కమిషనర్.. ప్రాధాన్యతా క్రమంలో డబుల్ బెడ్రూం ఇండ్లలో మౌలిక వసతుల కల్పనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు వాటర్ సప్లయి, డ్రైనేజీ , లిఫ్టులు, కరెంట్, రహదారులు, ఇతర సదుపాయాల పనులకు టెండర్లను ఆహ్వానించారు. కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్చెరు నియోజకవర్గంలోని డబుల్ బెడ్రూం ఇండ్లలో మౌలిక వసతులు కల్పించనున్నారు.